ఒక్క ఫైటర్ కోసం కదిలొచ్చిన మిలిటరీ
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:03 AM
ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయిన అమెరికా వైమానిక దళం ఎయిర్‌మెన్ కోసం ఆ దేశం అసాధారణ ఆపరేషన్ నిర్వహించింది. ‘అద్భుతం’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించిన....
వాషింగ్టన్/టెహ్రాన్, ఏప్రిల్ 5: ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయిన అమెరికా వైమానిక దళం ఎయిర్‌మెన్ కోసం ఆ దేశం అసాధారణ ఆపరేషన్ నిర్వహించింది. ‘అద్భుతం’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించిన ఈ ఆపరేషన్‌లో పదుల సంఖ్యలో వివిధ రకాలు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో పాటు సుశిక్షితులైన వందలమంది అమెరికా సైనికులు పాల్గొన్నారు. తమ ఎయిర్‌మెన్‌ను శత్రువు చేతికి చిక్కకుండా రక్షించుకున్నామని, అతడు కోలుకుంటున్నాడని ట్రంప్ ఆదివారం ప్రకటించారు. ఈ ఆపరేషన్ ద్వారా ఇరాన్ గగనతలం మొత్తం అమెరికా నియంత్రణలో ఉందన్న విషయం స్పష్టమైందని పేర్కొన్నారు. గత శుక్రవారం ఇరాన్‌లో దాడులు చేసేందుకు వెళ్లిన ఎఫ్-15ఈ స్ట్రయిక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని ఇరాన్ సైన్యం కూల్చివేసింది. దీంతో అందులో ఉన్న పైలట్‌తోపాటు ఆయుధ వ్యవస్థలను నియంత్రించే ఎయిర్‌మెన్ పారాచ్యూట్ల సాయంతో నేలకు దిగారు. విమానం కూలిన వెంటనే అమెరికాలో ఉన్న పెంటగాన్‌తోపాటు మధ్య ఆసియాలో ఉన్న యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పందించాయి. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే పైలట్‌ను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎయిర్‌మెన్ ఆచూకీ మాత్రం వెంటనే లభ్యం కాలేదు. అతడు కొండప్రాంతాలకు పారిపోయి తలదాచుకున్నాడు. అతడిని ఎలాగైనా బంధించాలన్న లక్ష్యంతో ఇరాన్ సైన్యం, ఎలాగైనా కాపాడుకోవాలన్న లక్ష్యంతో అమెరికా మిలిటరీ పోటాపోటీగా గాలింపు చేపట్టాయి. శనివారం అతడి ఆచూకీ గుర్తించిన అమెరికా.. వెంటనే పదుల సంఖ్యలో యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను వందలమంది సైనికులను ఆ ప్రాంతానికి పంపింది. ఈ ఆపరేషన్‌లో ప్రధానంగా సికోర్‌స్కీ హెచ్‌హెచ్-60డబ్ల్యూ జాలీ గ్రీన్-2 హెలికాప్టర్లు, ఏ-10 వార్‌థగ్ జెట్లు, హెచ్‌సీ-130 రెస్క్యూ మిడ్ ఎయిర్ ట్యాంకర్, ఎఫ్-35 యుద్ధ విమానాలు, బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు పాల్గొన్నాయి. తమతో అత్యంత విధ్వంసకర ఆయుధాలను కూడా మోసుకెళ్లాయి. ఎఫ్-35 విమానాలు గగనతలంలో ఎయిర్‌మెన్ ఉన్న ప్రాంతానికి రక్షణ కల్పిస్తుండగా, బీస్ట్ అని ముద్దుగా పిలుచుకొనే హెచ్‌హెచ్-60డబ్ల్యూ హెలికాప్టర్లు అతడిని రక్షించే పని నిర్వహించాయి. గాయపడిన అతడిని సురక్షితంగా శత్రువు భూభాగం నుంచి తరలించాయి. ఈ ఆపరేషన్ సమయంలో ఇరాన్, అమెరికా సైనికుల మధ్య భీకరమైన కాల్పులు చోటుచేసుకున్నట్లు అల్ జజీరా వార్తా సంస్థ తెలిపింది. ఎఫ్-35 యుద్ధ విమానాలు ఇరాన్ మిలిటరీ కాన్వాయ్ ముందుకు రాకుండా అడ్డుకొని క్షిపణులు ప్రయోగించాయి. ఒక బ్లాక్‌హాక్ హెలికాప్టర్‌పై ఇరాన్ సైన్యం దాడి చేయగా అది పాక్షికంగా దెబ్బతిన్నది, అందులోని సిబ్బంది గాయపడ్డారు. అయినా, శత్రువుకు దొర క్కుండా అది గాల్లోకి లేచి వెళ్లిపోయినట్లు సమాచారం.
ఇరాన్‌ను తికమకపర్చిన సీఐఏ
తప్పిపోయిన ఎయిర్‌మెన్ ఆచూకీని అమెరికా మిలిటరీ గుర్తించకముందే ఇరాన్‌లో అమెరికా గూఢచారి సంస్థ (సీఐఏ) అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అక్కడి తన ఏజెంట్ల ద్వారా ఆ ఎయిర్‌మెన్ ఆచూకీని అమెరికా ఇప్పటికే కనుగొందని, అతడిని రక్షించేందుకు ఆపరేషన్ కూడా చేపట్టిందని వదంతిని వేగంగా వ్యాపింపజేసింది. దీంతో ఇరాన్ సైన్యం గందరగోళంలో పడిపోయింది. అదే అదనుగా ఎయిర్‌మెన్ ఆచూకీని కనిపెట్టి క్షణాల్లో అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్‌కు, రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌కు సమాచారం చేరవేసింది. దీంతో శనివారం రాత్రే అమెరికా మిలిటరీ ఆపరేషన్ మొదలుపెట్టి, ఆదివారం తెల్లవారే సరికి పూర్తిచేసింది. అయితే, ఈ ఆపరేషన్ సమయంలో రెండు ఎంసీ-130జే రవాణా విమానాలను అమెరికా సైనికులే పేల్చివేసి వెనక్కు వచ్చారని ఆ దేశ వైమానిక దళం అధికారులను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ వార్తా సంస్థ తెలిపింది.