Share News

భారత్‌పై సుంకాలు తగ్గొచ్చు!

ABN , Publish Date - Jan 25 , 2026 | 02:46 AM

భారత్‌పై విధించిన 50 శాతం ప్రతీకార సుంకాలను త్వరలోనే సగానికి తగ్గించే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ తెలిపారు.

భారత్‌పై సుంకాలు తగ్గొచ్చు!

25 శాతం సుంకాలు తగ్గించే అవకాశం.. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ వెల్లడి

మీ రక్షణ బాధ్యత, ఖర్చులు మీవే

మిత్రదేశాలకు అమెరికా స్పష్టీకరణ

వాషింగ్టన్‌, జనవరి 24: భారత్‌పై విధించిన 50 శాతం ప్రతీకార సుంకాలను త్వరలోనే సగానికి తగ్గించే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ తెలిపారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు విధించిన 25 శాతం సుంకాలను త్వరలోనే ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. పొలిటికో వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ‘భారత్‌పై మేము విధించిన 25 శాతం (రష్యా నుంచి చమురు కొంటున్నందుకు) సుంకాలు గొప్ప విజయం సాధించాయి. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. సుంకాలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని త్వరలోనే రద్దు చేసే అవకాశం ఉందని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. భారత్‌- అమెరికా మధ్య వాణిజ్య లోటు అధికంగా ఉందన్న సాకుతో 25 శాతం, రష్యా నుంచి చమురు కొంటున్నందుకు 25 శాతం కలిపి మొత్తం 50 శాతం ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 27 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వచ్చాయి. కాగా, భారత్‌తో వాణిజ్య ఒప్పందం కోసమే యూరోపియన్‌ యూనియన్‌ తమలాగా భారత్‌పై సుంకాలు విధించకుండా వెనక్కి తగ్గిందని బెసెంట్‌ తెలిపారు. భారత్‌ నుంచి శుద్ధిచేసిన ఎనర్జీ ఉత్పత్తును యూరోపియన్లు కొనుగోలు చేయటం మూర్ఖత్వమని విమర్శించారు. కాగా, చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్న కెనడాపై 100 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. చైనా వస్తువులను అమెరికాలోకి తరలించేందుకు తన దేశాన్ని చైనాకు గోదాములా మార్చేయాలని కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ ప్రయత్నిస్తున్నారని శనివారం విమర్శించారు. ఈ ప్రయత్నాలను ఆపకపోతే అమెరికాలోకి వచ్చే కెనడా వస్తువులపై 100 శాతం సుంకాలు విధిస్తామని స్పష్టంచేశారు.


అమెరికా నూతన జాతీయ రక్షణ వ్యూహం

’అమెరికా ఫస్ట్‌’ అన్న తన నినాదాన్ని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ మరింత ముందుకు తీసుకు వెళ్తున్నారు. దీనిలో భాగంగానే తమ జాతీయ రక్షణ వ్యూహంలో కీలక మార్పులు చేశారు. ఇకపై అమెరికా మిత్రదేశాలు వారి భద్రతను వారే చూసుకోవాలని అమెరికా తేల్చి చెబుతోంది. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం 34 పేజీలతో కూడిన జాతీయ భద్రతా వ్యూహాన్ని రూపొందించింది. 2022 తర్వాత తొలిసారి రూపొందించిన అమెరికా రక్షణ వ్యూహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు మిత్రదేశాల రక్షణ ఖర్చులను గతంలోని అమెరికా ప్రభుత్వాలే భరించాయని, ఇకపై అటువంటి విధానం ఉండదని ఈ నివేదిక పేర్కొంది. మిత్రదేశాలు వాటి రక్షణ ఖర్చులను వారే పెట్టుకోవాలని స్పష్టం చేసింది. యూర్‌పనుంచి ఆసియా వరకు ఉన్న అనేక మిత్రదేశాలు అమెరికాపైనే ఆధారపడి తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోలేదని చెప్పింది. ఇకపై రష్యా, ఉత్తర కొరియా వంటి దేశాలనుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడంలో వారే కీలకంగా వ్యవహరించాలని తెలిపింది.

Updated Date - Jan 25 , 2026 | 05:59 AM