39 రోజులు.. 39 ఎయిర్‌క్రాఫ్ట్స్!
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:25 AM
ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు గణనీయంగా నష్టం జరిగింది. మొత్తంగా 39 రోజుల్లో యుద్ధ విమానాలు, భారీ డ్రోన్లు సహా 39 ఎయిర్‌క్రాఫ్ట్స్ను అమెరికా కోల్పోయింది.
ఇరాన్‌పై యుద్ధంలో కోల్పోయిన అమెరికా!
సీబీఎస్ వార్తా సంస్థ నివేదికలో వెల్లడి
వాషింగ్టన్, ఏప్రిల్ 11: ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు గణనీయంగా నష్టం జరిగింది. మొత్తంగా 39 రోజుల్లో యుద్ధ విమానాలు, భారీ డ్రోన్లు సహా 39 ఎయిర్‌క్రాఫ్ట్స్ను అమెరికా కోల్పోయింది. అమెరికా రక్షణ వర్గాలను ఉటంకిస్తూ సీబీఎస్ వార్తాసంస్థ ఈ వివరాలను తాజాగా వెల్లడించింది. ఆ కథనం ప్రకారం.. 39 రోజుల్లో అమెరికా 13 వేలకుపైగా వైమానిక దాడులు చేసింది. ఈ క్రమంలో ఇరాన్ రక్షణ వ్యవస్థల దాడి, ఇతర కారణాలతో 39 ఎయిర్‌క్రా్‌ఫ్టలను కోల్పోయింది. అత్యధికంగా ఒక్కోటీ రూ.280 కోట్ల విలువైన 24 ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను అమెరికా నష్టపోయింది. వీటితోపాటు ఒక ఏ-10 వార్త్‌హాగ్ విమానం, ఒక ఎఫ్-15ఈ ఫైటర్లను ఇరాన్ కూల్చివేసింది. ఒక ఎఫ్-35ఏ ఫైటర్ కూడా దెబ్బతిన్నది. ఇక మూడు ఎఫ్-15ఈ ఫైటర్లు కువైట్ రక్షణ వ్యవస్థలు పొరపాటుగా చేసిన దాడిలో కూలిపోయాయి. సౌదీలోని అమెరికా ఎయిర్‌బేస్ పై ఇరాన్ చేసిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో ఒక ఈ-3జీ సెంట్రీ అవాక్స్ విమానం, ఐదు కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్ విమానాలు ధ్వంసమయ్యాయి. ఇరాక్‌లో ఇరాన్ అనుకూల ఇస్లామిక్ రిపబ్లిక్ గ్రూపు ఒక కేసీ-135 విమానాన్ని కూల్చివేసింది. ఇరాన్ కూల్చిన ఎఫ్-15ఈ పైలట్ కోసం చేపట్టిన సహాయక చర్యల్లో పాల్గొన్న రెండు సీ-130 విమానాలు, రెండు బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు ఇరాన్ దాడిలో దెబ్బతిన్నాయి. దీనికితోడు కీలక సాంకేతిక సమాచారం, పరికరాలు ఇరాన్‌కు చిక్కకుండా అమెరికా స్వయంగా పలు ఎయిర్‌క్రాఫ్ట్స్ను ధ్వంసం చేసినట్టు వార్తలు వెలువడ్డాయి.