Umar Khalid: ఉమర్‌కు మమ్దానీ సంఘీభావం
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:01 AM
న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఐదేళ్లుగా ఢిల్లీ జైల్లో ఉన్న జేఎన్‌యూ ఉద్యమకారుడు ఉమర్ ఖలీద్‌కు సంఘీభావం తెలుపుతూ సందేశం పంపించారు....
మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నామని సందేశం
ఉమర్‌కు మద్దతుగా అమెరికా చట్ట సభ్యుల లేఖ
భారత్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే: బీజేపీ
న్యూయార్క్, జనవరి 2: న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఐదేళ్లుగా ఢిల్లీ జైల్లో ఉన్న జేఎన్‌యూ ఉద్యమకారుడు ఉమర్ ఖలీద్‌కు సంఘీభావం తెలుపుతూ సందేశం పంపించారు. ఉమర్ ఖలీద్ సహచరి బానోజ్యోత్స్న లాహిరి ఆ సందేశంతో కూడిన లేఖను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘‘మనం అనుభవించిన కష్టం మన వ్యక్తిత్వాన్ని మార్చేయకూదని నువ్వు చెప్పే మాటలు నేనెప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటా. మీ అమ్మానాన్నలను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాం’’ అన్నారు. మమ్దానీ సందేశాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ లాహిరి, ‘‘జైలు నిన్ను సమాజానికి దూరం చేయాలని చూసినా పదాలు ప్రయాణిస్తున్నాయి. ఉమర్‌కు మమ్దానీ రాసిన లేఖ’’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఖాలిద్, మరికొందరు 2020 ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అల్లర్లకు సూత్రధారులంటూ కేంద్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద జైల్లో పెట్టింది. ఇంతవరకు వారెవరికీ బెయిలు రాలేదు. మరోపక్క అమెరికా చట్టసభ సభ్యులు ఎనిమిది మంది ఉమర్ ఖలీద్‌కు బెయిలు ఇవ్వాలంటూ భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మేరకు అమెరికాలో ఉన్న భారత రాయబారి వినయ్ ఖ్వాత్రాకు లేఖ పంపించారు. అంతర్జాతీయ న్యాయానికి అనుగుణంగా ఆయనపై త్వరగా విచారణ జరపాలని కోరారు. లేఖ రాసిన వారిలో జిమ్ మెక్‌గ్రోవన్, జామీ రస్కిన్ ఉన్నారు. భారత్, అమెరికాలు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని, చట్టబద్ధ పాలన కలిగిన, మానవ హక్కులను గౌరవించే దేశాలని వారు లేఖలో ప్రస్తావించారు. విషయం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని తమకు తెలుసని, ఉమర్ ఖలీద్ చెల్లెలి వివాహానికి హాజరయ్యేందుకు తాత్కాలిక బెయిలు లభించిన విషయం కూడా తెలుసని లేఖలో పేర్కొన్నారు. అమెరికా చట్టసభ సభ్యుల లేఖ వెనుక రాహుల్‌గాంధీ ఉన్నారని బీజేపీ ఆరోపించింది. లేఖ రాసిన 8మందిలో ఇద్దర్ని రాహుల్ అమెరికా పర్యటన సందర్భంగా 2024లో కలిశారని తెలిపింది. అప్పటి ఫోటోను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియాతో మాట్లాడుతూ, మమ్దానీ భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇండియాను ముక్కలు చేయాలని మాట్లాడి జైలు పాలయిన నేరస్థుడికి మద్దతు పలకడం ఖురాన్‌ను అవమానించడమేనని మమ్దానీని ఉద్దేశించి వీహెచ్‌పీ వ్యాఖ్యానించింది.