గురిచూసి దెబ్బ
ABN , Publish Date - Mar 02 , 2026 | 02:24 AM
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతమొందించటంలో అమెరికా, ఇజ్రాయెల్‌లు పక్కా ప్రణాళికతో ముందుకు కదిలాయి.
ఖమేనీ కదలికలపై కొన్ని నెలలుగా నిఘా
పక్కా సమాచారం సేకరించిన ఇజ్రాయెల్, అమెరికా గూఢచారులు
శనివారం ఉదయం సలహాదారులతో భేటీ అవుతున్నట్లు గుర్తింపు
వెంటనే ఆయన నివాసంపై 30 బాంబులు కుమ్మరించిన ఇజ్రాయెల్
వాషింగ్టన్, మార్చి1: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతమొందించటంలో అమెరికా, ఇజ్రాయెల్‌లు పక్కా ప్రణాళికతో ముందుకు కదిలాయి. ఖమేనీ ఎప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఆయనను ఎవరు కలుస్తున్నారు? అనే సమాచారాన్ని అత్యంత కచ్చితత్వంతో సేకరించి, గురిచూసి దాడి చేశాయి. ఖమేనీయే లక్ష్యంగా ఈ రెండు దేశాలు కొన్ని నెలలుగా అత్యంత రహస్య ఆపరేషన్ నిర్వహించినట్లు అమెరికా మీడియా పేర్కొంది. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ, ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ ఏజెంట్లు ఎవరికి వారు ఖమేనీ సమాచారాన్ని సేకరిస్తూ.. దానిని ఎప్పటికప్పుడు పరస్పరం పంచుకున్నారు. ఖమేనీని అంతం చేయటంలో ఆంత్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను కూడా వాడుకున్నట్లు తేలింది.
శనివారం మీటింగ్..వెంటనే దాడి
ఖమేనీ తన సలహాదారులు, మిలిటరీ ఉన్నతాధికారులతో శనివారం మూడు సమావేశాల్లో పాల్గొనబోతున్నట్లు అమెరికా, ఇజ్రాయెల్ గూఢచారులు గుర్తించారు. ఆ సమావేశాలు ఎక్కడ జరగబోతున్నాయన్న కచ్చితమైన సమాచారం తెలియనప్పటికీ.. శనివారం సాయంత్రం అత్యంత కీలక సమావేశం జరుగుతుందని ఇరాన్‌లోని సీఐఏ ఏజెంట్లు తొలుత తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే, ఆ సమావేశం శనివారం ఉదయమే జరుగుతోందని మోసాద్ ఏజెంట్లు కచ్చితమైన సమాచారం సేకరించి, స్వదేశంతోపాటు అమెరికాకు చేరవేశారు. ఈ అవకాశం చేజారితే ఖమేనీ రహస్య ప్రదేశానికి వెళ్లిపోవచ్చని భావించిన రెండు దేశాలు.. వెంటనే రంగంలోకి దిగాయి. అమెరికా మిలిటరీతో సమన్వయం చేసుకొంటూ ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఖమేనీ నివాసంపై ఒకేసారి 30 బాంబులను కుమ్మరించాయి. దీంతో ఆ భవనం తునాతునలు అయిపోయింది. దాడికి ముందు సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజానీతోపాటు మరీ కీలక నేత షంఖానీతో ఖమేనీ సమావేశమైనట్లు ఇరాన్ అధికార వర్గాలు తెలిపాయి.
ఆంత్రోపిక్ క్లాడ్‌తో చెక్
ఖమేనీ ఆనుపానులు ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు, ఆలస్యం కాకుండా అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసేందుకు అమెరికా సైన్యం ఆదేశానికి చెందిన ఆంత్రోపిక్ సంస్థ అభివృద్ధి చేసిన క్లాడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించుకున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ వార్తా సంస్థ తెలిపింది. అది కూడా అధ్యక్షుడు ట్రంప్ ఆ సంస్థను ప్రభుత్వ సంస్థలు వినియోగించకుండా నిషేధం విధించిన కొన్ని గంటల తర్వాత మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైన్యం నిఘా సమాచార అధ్యయనం, టార్గెట్‌ను కచ్చితంగా గుర్తించేందుకు క్లాడ్‌ను వాడుకుందని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 3వ తేదీన వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అర్థరాత్రి ఆయన నివాసం నుంచి అపహరించిన ఆపరేషన్‌లో కూడా అమెరికా సైన్యం క్లాడ్ ఏఐనే వినియోగించినట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ రిపోర్టు చేసింది.
సౌదీ యువరాజు మంత్రాంగం!
ఇరాన్‌పై అమెరికా దాడి చేసేలా సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ మంత్రాంగం నడిపినట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఓ పత్రిక కథనం ప్రకారం ఆయన గత నెలలో ట్రంప్‌నకు పలుమార్లు ఫోన్ చేసి ప్రయివేటుగా ఈ విషయమై సంభాషించారు. బహిరంగంగా ఇరాన్‌కు అనుకూలంగా మాట్లాడినా లోలోపల లాబియింగ్ జరిపి అమెరికా దాడి చేసేలా చూశారని ఆ పత్రిక పేర్కొంది. అరబ్ పత్రికల కథనం ప్రకారం.. గతంలో అమెరికా ఎయిర్ బేస్‌లపై ఇరాన్ దాడులు చేసిన ప్పుడు సల్మాన్.. పొరుగు దేశాల పాలకులతో మాట్లాడారు. ఇరాన్ దాడుల నుంచి ఆ దేశాలకు భద్రత కల్పించేందుకు వనరులను సమీకరిస్తామన్నారు.