Share News

48 గంటలే గడువు.. హోర్ముజ్‌ తెరవకుంటే విద్యుత్‌ వ్యవస్థలను నాశనం చేస్తాం..

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:00 AM

హోర్ముజ్‌ జలసంధిని 48 గంటల్లో పూర్తిగా తెరిచి, నౌకల స్వేచ్ఛా రవాణాకు వీలుకల్పించాలని.. లేకుంటే ఇరాన్‌లోని విద్యుత్‌ కేంద్రాలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు.

48 గంటలే గడువు.. హోర్ముజ్‌ తెరవకుంటే విద్యుత్‌ వ్యవస్థలను నాశనం చేస్తాం..

  • ఇరాన్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌ అల్టిమేటం

  • తీవ్ర ప్రతీకారం తప్పదన్న ఇరాన్‌

వాషింగ్టన్‌/దుబాయ్‌/న్యూఢిల్లీ, మార్చి 22: హోర్ముజ్‌ జలసంధిని 48 గంటల్లో పూర్తిగా తెరిచి, నౌకల స్వేచ్ఛా రవాణాకు వీలుకల్పించాలని.. లేకుంటే ఇరాన్‌లోని విద్యుత్‌ కేంద్రాలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ‘‘ఇప్పటి నుంచి 48 గంటలలోగా హోర్ముజ్‌ జలసంధిని ఎలాంటి బెదిరింపులూ లేకుండా, పూర్తిగా తెరవకపోతే.. ఇరాన్‌లోని విద్యుత్‌ కేంద్రాలపై అమెరికా దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేస్తుంది. పెద్ద విద్యుత్‌ కేంద్రంతో మొదలుపెడతాం’’ అని ఆదివారం తెల్లవారుజామున ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు. హోర్ముజ్‌ జలసంధి మూసివేత, పశ్చిమాసియాలో ఇంధన వ్యవస్థలపై పరస్పర దాడులతో చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ట్రంప్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇరాన్‌ 6నెలల వరకు హోర్ముజ్‌ను మూసి ఉంచగలదని అమెరికా రక్షణ గూఢచార సంస్థ అంచనా వేసిందని.. దీనిపై అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌లో విస్తృత చర్చ జరిగిందని సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ తీవ్రస్థాయిలో హెచ్చరికలకు దిగినట్టు చెబుతున్నారు. కాగా, ఇరాన్‌ అంతమైపోయినట్టేనని, ఇక అమెరికాకు అతిపెద్ద శత్రువు ర్యాడికల్‌ లెఫ్ట్‌, అసమర్థ డెమోక్రాటిక్‌ పార్టీయేనని ట్రంప్‌ మరో పోస్టులో వ్యాఖ్యానించారు.


శత్రుదేశాల నౌకలు తప్ప అన్నీ వెళ్లొచ్చు

ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇరాన్‌ తీవ్రంగా మండిపడింది. తమ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ‘‘ఇరాన్‌కు చెందిన ఇంధన, విద్యుత్‌ వ్యవస్థలను శత్రువులు లక్ష్యంగా చేసుకుంటే... మేం పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు, ఆ దేశ సంస్థలతో సంబంధమున్న అన్ని ఇంధన, ఐటీ, నీటిశుద్ధి(డీసాలినేషన్‌) మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తాం’’ అని పేర్కొంది. తమ దేశంలోని విద్యుత్‌ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న వెంటనే హోర్ముజ్‌ జలసంధిని పూర్తిగా మూసేస్తామని, తమ విద్యుత్‌ కేంద్రాలను పునర్నిర్మించే వరకు తెరవబోమని ఐఆర్‌జీసీ ప్రకటించింది. కాగా, తమ శత్రుదేశాల నౌకలు తప్ప, ఇతర దేశాల నౌకలను హోర్ముజ్‌ నుంచి అనుమతిస్తున్నామని.. ఇందుకోసం ఒక భద్రమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్‌ మ్యారీటైమ్‌ ఆర్గనైజేషన్‌లో ఇరాన్‌ ప్రతినిధి అలీ మౌసావి వెల్లడించారు.


డీసాలినేషన్‌ ప్లాంట్లు అత్యంత కీలకం!

ఎడారి ప్రాంతాలైన గల్ఫ్‌ దేశాల్లో స్థానికంగా నీటి వనరులు చాలా తక్కువ. సముద్రపు నీటినే మంచినీటిగా మార్చుకుని(డీసాలినేషన్‌) తాగడానికి, ఇతర అవసరాలకు వినియోగిస్తారు. అందుకే డీసాలినేషన్‌ ప్లాంట్లు అత్యంత కీలకం. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తొలివారంలో ఇరాన్‌లోని ఒక డీసాలినేషన్‌ ప్లాంటుపై ఇజ్రాయెల్‌ దాడి చేసింది. ప్రతిగా బహ్రెయిన్‌లోని డీసాలినేషన్‌ ప్లాంటును ఇరాన్‌ డ్రోన్లతో ధ్వంసం చేసింది. దీనితో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. నీటిశుద్ధి ప్లాంట్ల జోలికి వెళ్లవద్దని అన్ని వర్గాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. అయితే ఇరాన్‌ విద్యుత్‌ కేంద్రాలను పేల్చస్తామని ట్రంప్‌ ప్రకటించడంతో... గల్ఫ్‌ దేశాల్లోని డీసాలినేషన్‌ ప్లాంట్లను నాశనం చేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది.

ఎఫ్‌-15 ఫైటర్‌ను కూల్చేశాం: ఐఆర్‌జీసీ

హోర్ముజ్‌ దీవికి సమీపంలో దక్షిణ తీరం వద్ద శత్రువుల ఎఫ్‌-15 యుద్ధ విమానాన్ని కూల్చేశామని ఐఆర్‌జీసీ ప్రతినిధులను ఉటంకిస్తూ టెహ్రాన్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. ఈ మేరకు ఇన్‌ఫ్రారెడ్‌ ట్రాకింగ్‌ వ్యవస్థతో యుద్ధ విమానాన్ని గుర్తించి, క్షిపణితో దాడి చేస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. అయితే దీనిపై అమెరికా, ఇజ్రాయెల్‌ వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణుల అభివృద్ధి, టెస్టింగ్‌, అసెంబ్లింగ్‌కు కీలకమైన ‘కుక్‌ ఈ బర్జమాలి’ క్షిపణి కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని అమెరికా ఆదివారం వెల్లడించింది. మరోవైపు. లెబనాన్‌లో సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో ఇళ్లను ఇజ్రాయెల్‌ కూల్చివేస్తోంది.


పశ్చిమాసియాకు బ్రిటన్‌ అణు జలాంతర్గామి

బ్రిటన్‌ తమ అణు జలాంతర్గామి హెచ్‌ఎంఎ్‌స ఆన్‌స్టన్‌ను హోర్ముజ్‌ జలసంధివైపు తరలించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతుండటం, యూకే-అమెరికా ఉమ్మడి సైనిక స్థావరం డీగో గార్సియాపైకి ఇరాన్‌ క్షిపణులు ప్రయోగించడం నేపథ్యంలో జలాంతర్గామి తరలింపు ప్రాధాన్యం సంతరించుకుంది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌ నుంచి ఈ నెల 6న బయలుదేరిన హెచ్‌ఎంఎ్‌స ఆన్‌స్టన్‌ జలాంతర్గామి ప్రస్తుతం అరేబియా సముద్రంలో హోర్ముజ్‌ జలసంధికి సమీపంలో మోహరించినట్టు అంచనా. ఆదేశాలు రాగానే దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు.

కాల్పుల విరమణ కోసం తుర్కియే ప్రయత్నాలు

అమెరికా- ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ కోసం తుర్కియే ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై పలు దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్‌ ఫిదాన్‌ ఆదివారం ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ, ఈజిప్ట్‌ మంత్రి బద్ర్‌ అబ్దెలట్టీ, యూరోపియన్‌ యూనియన్‌ విదేశాంగ విభాగం చీఫ్‌ కాజా కల్లాస్‌, అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారులతో వేర్వేరుగా చర్చించారని రాయిటర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది.

గ్రీన్‌లాండ్‌ను మేం రక్షిస్తాం

ఈయూకు ఇరాన్‌ ఆఫర్‌

గ్రీన్‌లాండ్‌ను అమెరికా ఆక్రమించుకోకుండా అడ్డుకుంటామని, అవసరమైతే ఆ ప్రాంతాన్ని తామే రక్షిస్తామని ఇరాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) గనుక గ్రీన్‌లాండ్‌ను కాపాడుకోలేకపోతే, సాయం కోరాలని.. తామ వచ్చి ఆ ప్రాంతానికి రక్షణ కల్పిస్తామని ఇరాన్‌ పోలీస్‌ అధికారి అహ్మద్‌ రెజా రాదాన్‌ వ్యాఖ్యానించారు. ‘‘మీ భూ భాగాన్ని కాపాడుకోలేకపోతే మా సాయం అడగండి, ట్రంప్‌ నుంచి గ్రీన్‌లాండ్‌ను మేం కాపాడుతాం. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని ఈయూ దేశాలను ఉద్దేశించి ఆయన అన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 07:30 AM