Share News

US Imposes Sanctions on Venezuela President Maduro: పెట్రో డాలర్‌ను ఎదిరించినందుకే..

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:10 AM

ప్రపంచ చమురు విపణిపై ఆధిపత్యం.. తమ కరెన్సీ అయిన డాలర్‌కు ప్రత్యామ్నాయ మారకంలో చమురు క్రయవిక్రయాలు జరగకుండా అడ్డుకోవడం.. అమెరికా విదేశాంగ విధానంలో కీలకం

US Imposes Sanctions on Venezuela President Maduro: పెట్రో డాలర్‌ను ఎదిరించినందుకే..

  • వెనెజువెలా అధ్యక్షుడికి అమెరికా శిక్ష

(‘ఆంధ్రజ్యోతి’ గల్ఫ్‌ ప్రతినిధి)

ప్రపంచ చమురు విపణిపై ఆధిపత్యం.. తమ కరెన్సీ అయిన డాలర్‌కు ప్రత్యామ్నాయ మారకంలో చమురు క్రయవిక్రయాలు జరగకుండా అడ్డుకోవడం.. అమెరికా విదేశాంగ విధానంలో కీలకం. అందులో భాగంగానే.. తమను ఎదిరించేచమురు ఉత్పాదక దేశాధినేతలను పదవీచ్యుతులను చేయడం లేదా వారి ప్రాణాలు తీసి ఆయా దేశాలలో అంతర్యుద్ధం సృష్టించడం, అక్కడ తోలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటుచేయడం అగ్రరాజ్యానికి అలవాటు అనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను నిర్భంధించి తమ దేశానికి తీసుకెళ్లడం అందులో భాగమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మదురో నిర్బంధం అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనలో.. వెనెజువెలాతో అమెరికాకు కలిగిన నష్టాల గురించి కాకుండా ఆ దేశంలోని చమురు ఉత్పత్తి గురించి ప్రధానంగా ప్రస్తావించడం ఇందుకు ఉదాహరణ అని వారు గుర్తుచేస్తున్నారు. వెనెజువెలా చైనాకు యువాన్లలో (చైనీస్‌ కరెన్సీ) చమురును విక్రయిస్తుండడాన్ని అమెరికా సహించలేకపోతోంది. వెనెజువెలా చమురుకు చైనా ప్రధాన దిగుమతిదారు. వాస్తవానికి ప్రపంచంలోకెల్లా అత్యధిక చమురు నిల్వలు (సౌదీ కన్నా ఎక్కువ) కల్గిన దేశమైనా.. చమురు ఉత్పత్తి, ఎగుమతి విషయంలో వెనెజువెలా వెనుకబడి ఉండడానికి ప్రధాన కారణం అమెరికా ఆంక్షలే. అమెరికా నిఘా సంస్థలు, వివిధ రకాల (18) ఏజన్సీల సమాచారం ప్రకారం.. అగ్రరాజ్యానికి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేసే ప్రధాన రూట్లలో వెనెజువెలా లేదు. ఆ దేశంలోని రెండు ప్రధాన డ్రగ్‌ సిండికేట్లతో అధ్యక్షుడు మదురోకు సంబంధాలున్నట్లుగా ఆధారాలు కూడా లేవు.

ఇరాక్‌, లిబియాపైనా..

వెనెజువెలా తరహాలోనే.. చమురు ఉత్పత్తి దేశమైన ఇరాక్‌ కూడా గతంలో అమెరికా డాలర్‌ను వ్యతిరేకించింది. ఐక్యరాజ్య సమితి ఆహారానికి చమురు పథకం కింద.. డాలర్లలో కాకుండా యూరోలకు చమురును విక్రయించి లబ్ధి పొందింది. అందుకే 2003లో మారణాయుధాల పేర ఇరాక్‌ను దురాక్రమించి.. అప్పటి అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను పదవిచ్యుతుణ్ని చేసి, ఉరి తీసి చంపింది. కానీ, అమెరికా ఆరోపించినట్టు ఇరాక్‌లో ఏలాంటి మారణాయుధాలూ లభించలేదని ఆ తర్వాత యూఎన్‌ పరిశీలన బృందాలు, అమెరికా, బ్రిటన్‌ కలిపి ఏర్పాటుచేసిన ‘ఇరాక్‌ సర్వే గ్రూప్‌’, పలు స్వతంత్ర కమిషన్లు ధ్రువీకరించాయి. మరో కీలక చమురు ఉత్పత్తి దేశమైన లిబియా కూడ అమెరికా డాలర్‌కు వ్యతిరేకంగా గళమెత్తి ముందుకు వెళ్లడంతో ఆ దేశ అధ్యక్షుడు కల్నల్‌ గడ్డాఫీని పదవిచ్యుతుణ్ని చేసి హతమార్చారు. గడ్డాఫీ అనంతరం లిబియా పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిగా మారింది. ఇటీవలికాలంలో రష్యా పలు దేశాలకు డాలర్‌కు బదులుగా తమ కరెన్సీ అయిన రూబుల్స్‌ మారకం ద్వారా చమురును ఎగుమతి చేస్తుండడంతో తమ ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందోనని అమెరికా ఆందోళన చెందుతోంది. అందుకే రష్యా నుండి చమురును కొనుగోలు చేసే దేశాలను సుంకాల పేర దండిస్తోంది. భారత్‌పై కూడా.. తమ వద్ద నుండి చమురు కొనుగోళ్లను పెంచాల్సిందిగా దౌత్యపరమైన ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - Jan 06 , 2026 | 01:10 AM