Share News

ఇటు చర్చలు.. అటు ఆంక్షలు!

ABN , Publish Date - Feb 07 , 2026 | 03:54 AM

ఇరాన్‌లో ఖొమైనీ నేతృత్వంలోని ప్రభుత్వంపై అమెరికా తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచింది. శుక్రవారం మధ్యాహ్నం కువైట్‌లో ఒమన్‌ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిపింది.

ఇటు చర్చలు.. అటు ఆంక్షలు!

  • ఇరాన్‌పై ఒత్తిడి పెంచిన అమెరికా

  • ఇరాన్‌ చమురు సరఫరా చేసే 15సంస్థలు, ఇద్దరు వ్యక్తులు, 14 ట్యాంకర్లపై ఆంక్షలు

వాషింగ్టన్‌/టెహ్రాన్‌/మస్కట్‌, ఫిబ్రవరి 6: ఇరాన్‌లో ఖొమైనీ నేతృత్వంలోని ప్రభుత్వంపై అమెరికా తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచింది. శుక్రవారం మధ్యాహ్నం కువైట్‌లో ఒమన్‌ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిపింది. కొన్ని గంటల్లోనే ఇరాన్‌పై ఆంక్షలు విధించింది. అదే సమయంలో పశ్చిమాసియాకు సైనిక బలగాల తరలింపునూ కొనసాగించింది. ఇరాన్‌తో చర్చలు విఫలమైతే బలప్రయోగానికి వెనుకాడబోమని అమెరికా అధ్యక్ష కార్యాలయం ప్రతినిధి కరోలిన్‌ లీవిట్‌ ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం ఒమన్‌ రాజధాని కువైట్‌లో.. ఒమన్‌ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్‌ మధ్య పరోక్ష చర్చలు జరిగాయి. తొలుత ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ, అధికారులతో ఒమన్‌ విదేశాంగ మంత్రి అల్బుసైది చర్చించారు. తర్వాత అమెరికా ప్రతినిధులు స్టీవ్‌ విట్కాఫ్‌, కుష్నర్‌లతో భేటీ అయి చర్చించారు. అణు అంశాలు, ప్రాంతీయ భద్రతపై ఇరువర్గాల వాదనలు, సానుకూల అంశాల సమాచారాన్ని పరస్పరం అందించారు. ఈ చర్చలు సానుకూలంగా సాగాయని, మంచి ప్రారంభమని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ చెప్పారు. కానీ రాత్రికల్లా ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ప్రకటన చేసింది.

భారత సంస్థ, భారతీయ డైరెక్టర్‌పైన కూడా

ఇరాన్‌ నుంచి చమురు తరలింపుపై ఆంక్షలు ఉన్నా.. తప్పుడు గుర్తింపుతో దొంగచాటుగా చమురు సరఫరా చేస్తున్నారంటూ.. 15 సంస్థలు, 14 భారీ రవాణా ట్యాంకర్లపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. ఆ సంస్థలు, ట్యాంకర్లు ఇరాన్‌ నుంచి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రో రసాయనాలను తరలిస్తున్నట్టు గుర్తించామని పేర్కొంది. చమురు, సంబంధిత ఉత్పత్తుల విక్రయాలతో వచ్చే సొమ్మును ఇరాన్‌ ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులను ఎగదోయడానికి వినియోగిస్తోందని ఆరోపించింది. కాగా, అమెరికా ఆంక్షలు విధించిన సంస్థలు, వ్యక్తుల్లో భారత్‌కు చెందిన ఎలివేట్‌ మెరైన్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీతోపాటు ఈ సంస్థ డైరెక్టర్‌ ఆకాశ్‌ అనంత్‌ షిండే ఉన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 03:54 AM