డిపోర్టేషన్ ఆర్డర్ ఉన్నా గ్రీన్‌కార్డులు!
ABN , Publish Date - Nov 25 , 2026 | 04:13 AM
అమెరికాలో దశాబ్దాలుగా నివసిస్తున్నప్పటికీ, బహిష్కరణ(డిపోర్టేషన్) ఆదేశాలను ఎదుర్కొంటున్న వలసదారులకు ఉపశమనం కల్పించే దిశగా డెమోక్రటిక్ ఎంపీలు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్నవారికి ఉపశమనం కల్పించేలా అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల బిల్లు
వాషింగ్టన్, నవంబరు 24: అమెరికాలో దశాబ్దాలుగా నివసిస్తున్నప్పటికీ, బహిష్కరణ(డిపోర్టేషన్) ఆదేశాలను ఎదుర్కొంటున్న వలసదారులకు ఉపశమనం కల్పించే దిశగా డెమోక్రటిక్ ఎంపీలు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. వారిపై డిపోర్టేషన్ ఆదేశాల రద్దు, అనంతరం గ్రీన్‌కార్డు పొందేందుకు వెసులుబాటు కల్పించేలా ‘ప్రొటెక్ట్ అవర్ నైబర్స్ యాక్ట్’ పేరుతో నవంబర్ 19న ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు. నిజానికి కాలిఫోర్నియాలో 30 ఏళ్లకుపైగా నివసించిన 73 ఏళ్ల భారత సంతతి మహిళ హర్జిత్ కౌర్ గత ఏడాది సెప్టెంబర్‌లో బహిష్కరణకు గురయ్యారు. దశాబ్దాలుగా అమెరికాలో నివసిస్తున్నవారిని కూడా పాత డిపోర్టేషన్ ఆదేశాలను చూపి దేశం నుంచి పంపివేస్తుండటంపై కలకలం చెలరేగింది. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు ఉపశమనం కల్పించేలా.. కాలిఫోర్నియాకు చెందిన ఎంపీలు లతీఫా సైమన్, జో లోఫ్ర్గెన్, జాన్ గారమెండి, జువాన్ వర్గాస్ ఈ బిల్లును రూపొందించారు. ఆ బిల్లు ప్రకారం.. తుది బహిష్కరణ ఉత్తర్వులు జారీ అయిన తర్వాత కూడా కనీసం పదేళ్లుగా అమెరికాలోనే ఉంటున్న వలసదారులు కొన్ని నిబంధనలకు లోబడి శాశ్వత నివాస హోదా (గ్రీన్‌కార్డు) పొందవచ్చు. క్రిమినల్ కేసులు, జాతీయ భద్రతకు సంబంధించిన కేసులు, ఆరోపణలు ఉండకూడదు. ప్రస్తుతం అమెరికాలో తుది బహిష్కరణ ఉత్తర్వులకు గడువు అంటూ ఏదీ లేదు. ఎవరైనా విదేశీయులపై దశాబ్దాల క్రితం డిపోర్టేషన్ ఉత్తర్వులు వచ్చి ఉన్నా.. ఇప్పుడు బహిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. అయితే తాజాగా డెమోక్రాట్లు పెట్టిన బిల్లులో.. డిపోర్టేషన్ ఉత్తర్వులు పదేళ్ల తర్వాత ఆటోమేటిక్‌గా రద్దయ్యేలా ప్రతిపాదించారు. అమెరికా ఐసీఈ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి తుది బహిష్కరణ ఉత్తర్వులు జారీ అయినవారు సుమారు 16 లక్షల మంది అమెరికాలో ఉన్నారు.