సరే.. కొనుక్కోండి!
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:06 AM
రష్యా చమురు కొన్నందుకు భారత్‌పై 25శాతం సుంకాలు విధించిన అమెరికా.. తాజా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు వెసులుబాటు కల్పించే నిర్ణయం తీసుకుంది.
రష్యా నుంచి 30 రోజులపాటు చమురు కొనుగోలుకు భారత రిఫైనరీలకు వెసులుబాటు కల్పించిన అమెరికా
న్యూఢిల్లీ, మార్చి 6: రష్యా చమురు కొన్నందుకు భారత్‌పై 25శాతం సుంకాలు విధించిన అమెరికా.. తాజా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు వెసులుబాటు కల్పించే నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు భారతీయ కంపెనీలకు 30 రోజులపాటు మినహాయింపునిచ్చింది. దీనివల్ల.. కొన్నాళ్లుగా నడిసముద్రంలో నిలిచిపోయిన చమురు నౌకలను భారత తీరానికి తరలించి, అమ్ముకునే అవకాశం రష్యాకు కలిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల నడుమ ప్రపంచ చమురు మార్కెట్‌పై ఒత్తిడి తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని అమెరికాకు చెందిన ఇద్దరు ఉన్నతస్థాయి అధికారులు చెప్పారు. అలాగే.. అంతర్జాతీయ విపణిలో చమురు సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూడడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా ట్రెజరీ కార్యదర్వి స్కాట్ బెసెంట్ తెలిపారు. ‘‘ఈ స్వల్పకాలిక చర్య వల్ల రష్యాకేమీ గణనీయమైన ఆర్థిక ఉపశమనం కలగదు. ఎందుకంటే.. ఇప్పటికే సముద్రంలో నిలిచిపోయిన చమురు నౌకలకు మాత్రమే వర్తిస్తుంది’’ అని, ఈ నిర్ణయం వల్ల రష్యాపై తక్కువ ఆర్థిక ప్రభావం మాత్రమే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భారత్ భవిష్యత్తులో అమెరికా నుంచి ముడిచమురు కొనుగోళ్లను భారీగా పెంచుతుందని తాము ఆశిస్తున్నట్టు తెలిపారు. అమెరికా ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురుసంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కంపెనీ, మంగళూరు రిఫైరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌లు.. రష్యా చమురు కొనుగోళ్లకు సంప్రదింపులు ప్రారంభించాయి. ఈ కంపెనీలన్నీ కలిసి రష్యా నుంచి 20 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు కొనేందుకు సిద్ధమయ్యాయి.
అయితే.. రష్యన్ కంపెనీలు యురల్స్ క్రూడ్ ఆయిల్‌ను బ్రెంట్ ముడిచమురు ధర కంటే బ్యారెల్‌కు 4-5 డాలర్ల అదనపు ధరకు అమ్మజూపుతున్నాయి. ఇదే చమురును ఫిబ్రవరిలో అవే కంపెనీలు బ్రెంట్ క్రూడ్ ధర కన్నా 13 డాలర్ల తక్కువకు విక్రయించడం గమనార్హం. బ్లూమ్‌బెర్గ్ వార్తాసంస్థ సేకరించిన షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. ఇప్పటికే కోట్లాది బ్యారెళ్ల చమురుతో కూడిన రష్యన్ నౌకలు ఇప్పటికే ఆసియా సముద్ర జలాల్లో ఉన్నాయి. 15 మిలియన్ బ్యారెళ్ల చమురు ట్యాంకర్లు అరేబియా సముద్రంలో, బంగాళా ఖాతంలో ఉండగా.. మరో 70 లక్షల బ్యారెల్ల చమురుతో కూడిన నౌకలు సింగపూర్‌లో లంగరు వేసి ఉన్నాయి. అంటే దాదాపుగా 2.2 కోట్ల బ్యారెళ్ల ముడిచమురు. వారంరోజుల్లోగా ఈ చమురంతా భారత తీరాలకు చేరే అవకాశం ఉంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. అమెరికా 30 రోజుల మినహాయింపు ఇవ్వడానికి ముందే కోటి బ్యారెళ్ల రష్యన్ క్రూడ్‌ను మన కంపెనీలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. భారత్‌కు విక్రయించే క్రూడాయిల్ వివరాల గురించి క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్‌ను మీడియా ప్రశ్నించగా.. తమ చెడు కోరుకునేవారు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ వివరాలను రహస్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.
ధరలు భారీగా పెరిగే ముప్పు..
యుద్ధం ఇదే తీవ్రతతో సుదీర్ఘకాలంపాటు కొనసాగితే.. చమురు ఎగుమతి దేశాలు ఉత్పత్తిని నిలిపివేసే ప్రమాదం ఉందని, ఫలితంగా సరఫరా నిలిచిపోయి బ్యారెల్ ముడిచమురు ధర 150 డాలర్ల మార్కును సైతం దాటే ప్రమాదం ఉందని ఖతార్ ఇంధన మంత్రి సాద్ అల్ కాబీ హెచ్చరించారు. ఖతార్‌లోని అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ప్లాంట్ అయిన రాస్ లఫ్ఫాన్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో ఆ దేశం గ్యాస్ ఉత్పత్తి నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎల్‌ఎన్‌జీ ధరలు 40 శాతానికి పైగా పెరిగాయి. యుద్ధం ఇప్పటికిప్పుడు ఆపినా కూడా ఆ ప్లాంట్ పనిచేయడం మొదలుపెట్టి, మళ్లీ మునుపటి మాదిరిగా సహజవాయువు సరఫరా చేయడానికి కొన్ని వారాల నుంచి నెలల సమయం పడుతుందని అల్ కాబీ స్పష్టం చేశారు. కాగా, చమురు ధరల పెరుగుదల ప్రభావం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. శుక్రవారంనాడు.. యూరోపియన్ మార్కెట్లుభారీగా పతనమయ్యాయి. ఐరోపా దేశాలు ఇంధనం, సహజవాయువు కోసం ఎక్కువగా పశ్చిమాసియా దేశాలపైనే ఆధారపడతాయి కాబట్టి అక్కడ ఇంధన కొరత భయం ఎక్కువగా ఉంది.