రెండు అమెరికా యుద్ధ విమానాలు ఢీ
ABN , Publish Date - May 19 , 2026 | 03:57 AM
వైమానిక విన్యాసాలు నిర్వహిస్తుండగా రెండు అమెరికా యుద్ధ విమానాలు పరస్పరం ఢీకొని కుప్పకూలాయి. ఈ ఘటనలో నలుగురు పైలట్లు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
విన్యాసాలు నిర్వహిస్తుండగా ప్రమాదం
తృటిలో ప్రాణాలతో బయటపడిన నలుగురు పైలట్లు
వాషింగ్టన్, మే 18: వైమానిక విన్యాసాలు నిర్వహిస్తుండగా రెండు అమెరికా యుద్ధ విమానాలు పరస్పరం ఢీకొని కుప్పకూలాయి. ఈ ఘటనలో నలుగురు పైలట్లు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. జెట్లు ఢీకొని కూలిపోతున్న వీడియో వైరల్‌గా మారింది. ఐడహోలోని మౌంటైన్ హోం ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ఆదివారం గన్‌ఫైటర్ స్కైస్ ఎయిర్ షో నిర్వహించారు. ఈ షోలో అమెరికా నేవీకి చెందిన రెండు ఈఏ-18జీ గ్రోలర్ యుద్ధ విమానాలు విన్యాసాలు నిర్వహించాయి. పొరపాటున ఈ విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. వెంటనే విమానాల్లోని నలుగురు పైలట్లు పారాచ్యూట్ల సాయంతో వాటిల్లో నుంచి దూకేశారు. వారు దూకిన కొద్ది క్షణాల్లోనే విమానాలు నేలపై కుప్పకూలి పేలిపోయాయి. పైలట్లు క్షేమంగానే ఉన్నారని, ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు అమెరికా నావల్ ఎయిర్‌ఫోర్స్ అధికార ప్రతినిధి తెలిపారు. ఇది చాలా ఘోరమైన ప్రమాదమని, ఇలాంటి ప్రమాదాల నుంచి పైలట్లు ప్రాణాలతో బయటపడటం అరుదైన విషయమని సైనిక నిపుణులు అంటున్నారు.