Share News

యుద్ధ నష్టం రూ.28,455 కోట్లు..!

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:17 AM

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా భారీగా ఆర్థిక, సైనిక నష్టాలను ఎదుర్కొంటోంది. అమెరికాతోపాటు పశ్చిమాసియాలోని దాని మిత్ర దేశాలపై ఇరాన్‌ చేస్తున్న దాడుల్లో సైనిక ఆస్తులకు గణనీయమైన నష్టం వాటిల్లింది.

యుద్ధ నష్టం రూ.28,455 కోట్లు..!

  • ఫైటర్‌ జెట్లు, డ్రోన్లు, రక్షణ వ్యవస్థలు ధ్వంసం.. మూడు వారాల్లోనే భారీగా ఆర్థిక, సైనిక నష్టం

  • ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ

న్యూయార్క్‌, మార్చి 29: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా భారీగా ఆర్థిక, సైనిక నష్టాలను ఎదుర్కొంటోంది. అమెరికాతోపాటు పశ్చిమాసియాలోని దాని మిత్ర దేశాలపై ఇరాన్‌ చేస్తున్న దాడుల్లో సైనిక ఆస్తులకు గణనీయమైన నష్టం వాటిల్లింది. ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ నివేదిక ప్రకారం మొదటి మూడు వారాల్లోనే సైనిక నష్టాలు, మరమ్మతుల కోసం సుమారు 3 బిలియన్‌ డాలర్ల (రూ.28,455 కోట్లు) వరకూ ఖర్చయినట్టు అంచనా. ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్‌ దాడుల వల్లే నష్టం ఎక్కువగా జరిగిందని భావిస్తున్నారు. వైట్‌హౌ్‌సకు పంపనున్న 200 బిలియన్‌ డాలర్ల అదనపు ఖర్చుల ప్రతిపాదనలో పెంటగాన్‌ ఈ నష్టాలకు సంబంధించిన లెక్కలు చూపనుంది.

మూడు ఎఫ్‌-15ఈ యుద్ధ విమానాలు

ఇరాన్‌తో యుద్ధం సందర్భంగా మార్చి 1న కువైత్‌కు చెందిన ఎఫ్‌/ఏ-18 యుద్ధ విమానం పొరపాటున మూడు ఎఫ్‌-15ఈ స్ట్రైక్‌ ఈగల్‌ యుద్ధ విమానాలను కూల్చివేసింది. ఈ విమానాల్లోని ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే.. అమెరికా కోల్పోయిన ఒక్కో యుద్ధ విమానం సుమారు 100 మిలియన్‌ డాలర్లు (రూ.950 కోట్లు) ఉంటుందని అంచనా. అలాగే మార్చి 19న ఇరాన్‌ క్షిపణి దాడిలో ఎప్‌-35ఏ లైట్నింగ్‌ 2 యుద్ధ విమానం కూడా దెబ్బతింది. ఈ ఫైటర్‌ జెట్‌ విలువ 82.5 మిలియన్‌ డాలర్లు (రూ.782 కోట్లు) ఉంటుంది.


4 విమానాలు.. ఆరుగురు సిబ్బంది..

ఇరాన్‌ దాడుల్లో అమెరికాకు చెందిన సైనిక ఇంధన సరఫరా విమానం కేసీ-135 స్ట్రాటోట్యాంకర్‌ కూలిపోయింది. దీనిలోని ఆరుగురు సిబ్బంది మరణించారు. దీంతోపాటు సౌదీలోని ప్రిన్స్‌ సుల్తాన్‌ ఎయిర్‌ బేస్‌పై ఇరాన్‌ జరిపిన క్షిపణి దాడిలో ఐదు కేసీ-135 విమానాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఈ విమానాల తయారీని నిలిపివేశారు. వీటి స్థానంలో రానున్న కేసీ-46 పెగాసస్‌ విమానం ధర 165 మిలియన్‌ డాలర్లు(రూ.1565 కోట్లు) ఉంటుంది. ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా డజనుకుపైగా ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్లను కోల్పోయింది. ఒక్కో ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్‌ ఖరీదు 16 మిలియన్‌ డాలర్లు(రూ.150 కోట్లు). కొత్త ఎంక్యూ-9బీ వేరియంట్ల ధర 30 మిలియన్‌ డాలర్లు (రూ.285 కోట్లు).

నౌకాదళానికీ ఎదురుదెబ్బ..

మార్చి 12న యూఎ్‌సఎస్‌ జెరార్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఈ విమానవాహక యుద్ధ నౌకలోని పలు విభాగాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం దీనికి గ్రీస్‌లో మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ నౌకపై ఇరాన్‌ క్షిపణులతో దాడి చేసిందని వార్తలు వెలువడినప్పటికీ.. అమెరికా వాటిని ఖండించింది. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాపై భారీగానే ఆర్థిక భారం పడింది. అత్యంత విలువైన ప్లాట్‌ఫామ్‌లు, నిఘా వ్యవస్థలు, డ్రోన్లు దెబ్బతిన్నాయి.

క్షిపణులు, రాడార్‌ వ్యవస్థకు నష్టం..

కీలక నిఘా, క్షిపణి రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్‌ దాడులకు పాల్పడింది. జోర్డాన్‌లో ఉన్న థాడ్‌ (టీహెచ్‌ఏఏడీ - టెర్మినల్‌ హై ఆల్టిట్యూడ్‌ ఏరియా డిఫెన్స్‌) క్షిపణి రక్షణ వ్యవస్థలో భాగమైన ఏఎన్‌/టీపీవై-2 రాడార్‌పై దాడి చేసింది. దీనివల్ల అమెరికాకు 300 మిలియన్‌ డాలర్ల (రూ.2,850 కోట్లు)కుపైగా నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. ఖతార్‌లోని అల్‌-ఉదీద్‌ వైమానిక స్థావరం వద్ద.. ఒకేసారి బహుళ ముప్పులను పసిగట్టగల సామర్థ్యం కలిగిన ఏఎన్‌/ఎఫ్‌పీఎస్‌-132 రాడార్‌కు కూడా నష్టం వాటిల్లినట్టు తెలిసింది. అలాగే యూఏఈ, బహ్రెయిన్‌, కువైత్‌, సౌదీ దేశాల్లోని రాడార్‌, గగనతల రక్షణ వ్యవస్థలపైనా దాడుల ప్రభావం పడినట్టు సమాచారం.

Updated Date - Mar 30 , 2026 | 04:17 AM