అదానీపై కేసు పెట్టాల్సింది కాదు
ABN , Publish Date - Jul 06 , 2026 | 03:04 AM
భారత్‌లో ప్రాజెక్టుల కోసం భారీగా లంచాలు ఇచ్చారని, పెట్టుబడిదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు పెట్టి ఉండాల్సింది కాదని ...
భారత్‌లో అదానీ లంచాలు ఇచ్చారన్న ఆరోపణలు అమెరికా కోర్టుల్లో నిరూపించడం సాధ్యంకాదు
ఫెడరల్ కోర్టులో అమెరికా న్యాయశాఖ అఫిడవిట్
కేసును పూర్తిగా ఉపసంహరించుకోవాలని నిర్ణయం
న్యూయార్క్, జూలై 5: భారత్‌లో ప్రాజెక్టుల కోసం భారీగా లంచాలు ఇచ్చారని, పెట్టుబడిదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు పెట్టి ఉండాల్సింది కాదని అమెరికా న్యాయశాఖ పేర్కొంది. అసలు ఈ వ్యవహారంలో అమెరికా జాతీయ భద్రతకుగానీ, పెట్టుబడిదారులకుగానీ పైసా నష్టం జరగలేదని స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ అమెరికాలో భారీగా పెట్టుబడులకు సిద్ధమైనందునే కేసు ఉప సంహరించుకుంటున్నారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఈ మేరకు అమెరికా జాతీయ (ఫెడరల్) కోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. అంతేకాదు లోపభూయిష్టమైన ఈ కేసును పూర్తిగా ఉపసంహరించుకోవాలన్న తమ నిర్ణయాన్ని సమీక్షించడంలో కోర్టు పాత్ర కూడా పరిమితమేనని పేర్కొంది.
భారీగా లంచాలు ఇచ్చారనే ఆరోపణలతో కేసు
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, మరో ఏడుగురిపై 2024లో బైడెన్ ప్రభుత్వ హయాంలో అమెరికా న్యాయశాఖ కేసు నమోదు చేసింది. వారు భారత ప్రభుత్వ అధికారులు, నేతలకు సుమారు రూ.2,300 కోట్లు(250 మిలియన్ డాలర్లు) లంచాలు ఇచ్చి భారీ ప్రాజెక్టులు పొందారని.. వాటితో పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించి వేల కోట్లు సమీకరించారని ఆరోపించింది. ఆ సమయంలో అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ.1,700 కోట్లు (175 మిలియన్ డాలర్లు) పెట్టుబడులు సమీకరించిందని పేర్కొంది. అమెరికా పెట్టుబడిదారుల ప్రయోజనాలు ముడిపడి ఉన్న దృష్ట్యా అదానీ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఫెడరల్ కోర్టును కోరింది. ఈ వ్యవహారం అప్పట్లో కలకలం రేపింది. అయితే బైడెన్ దిగిపోయి ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాక..ఈ వ్యవహారం మెత్తబడింది. ఆ కేసును ఉప సంహరించుకుంటామని ఫెడరల్ కోర్టుకు అమెరికా న్యాయశాఖ కొన్ని నెలల క్రితమే నివేదించింది. కారణాలను వివరిస్తూ న్యాయశాఖ తాజాగా 10 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ కేసు విచారణ చట్టపరంగా లోపభూయిష్టమని, దౌత్యపరంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని అఫిడవిట్‌లో అమెరికా న్యాయశాఖ ప్రిన్సిపల్ అసోసియేట్ డిప్యూటీ అటార్నీ జనరల్ ట్రెంట్ మెక్‌కాటర్ వివరించారు. ‘‘కేసును పూర్తిగా ఉపసంహరించుకోవాలన్న న్యాయశాఖ నిర్ణయాన్ని సమీక్షించడంలో కోర్టు అధికారం కూడా పరిమితమే’’ అని మెక్‌కాటర్ తెలిపారు. కేసు ఉప సంహరణకు కారణాలను వివరిస్తూ.. అదానీపై ఆరోపణలకు సంబంధించిన వ్యవహారమంతా భారత్‌లోనే జరిగిందని, భారత అధికారులు దర్యాప్తు చేపట్టి చర్యలు చేపట్టాల్సినంత తప్పులేమీ లేవని తేల్చారని మెక్‌కాటర్ పేర్కొన్నారు. కేసులో పేర్కొన్న సాక్ష్యాలు, ఆధారాలన్నీ విదేశాల్లో(భారత్‌లో) ఉన్నాయని, ఆరోపణలను నిరూపించడంలో ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో కేసు ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అంతేకాదు అమెరికా ప్రపంచానికే పోలీసు అన్నట్టు వ్యవహరించడం దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీస్తుందని వ్యాఖ్యానించారు. విదేశాల్లోని వ్యవహారాలతో వనరులను వృధా చేసుకోవడం కంటే.. అమెరికా అంశాలపై దృష్టిపెట్టడం మంచిదని పేర్కొన్నారు.