Share News

మా రోడ్లను వీడండి

ABN , Publish Date - Sep 11 , 2026 | 05:20 AM

వలసదారులు స్వచ్ఛందంగా అమెరికాను వీడాలంటూ హోంలాండ్‌ సెక్యూరిటీ విభాగం(డీహెచ్‌ఎస్‌) తాజాగా విడుదల చేసిన ఒక పోస్టర్‌లో ‘మిస్టర్‌ సింగ్‌’ అంటూ ప్రస్తావించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మా రోడ్లను వీడండి

  • భారతీయ డ్రైవర్లపై అమెరికా కొరడా

  • మిస్టర్‌ సింగ్‌.. నీకు డ్రైవింగ్‌ రాదు అంటూ పోస్టర్‌

  • జాతివివక్ష అంటూ మండిపడుతున్న నెటిజన్లు, సిక్కులు

వాషింగ్టన్‌, సెప్టెంబరు 10: వలసదారులు స్వచ్ఛందంగా అమెరికాను వీడాలంటూ హోంలాండ్‌ సెక్యూరిటీ విభాగం(డీహెచ్‌ఎస్‌) తాజాగా విడుదల చేసిన ఒక పోస్టర్‌లో ‘మిస్టర్‌ సింగ్‌’ అంటూ ప్రస్తావించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది జాతివివక్షేనని, భారతీయులకు వ్యతిరేకంగా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికాలోని వలసదారులపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే డీహెచ్‌ఎస్‌ తాజాగా ఈ పోస్టర్‌ను విడుదల చేసింది. హాలీవుడ్‌ సినిమా ‘ట్రాన్స్‌ఫార్మర్స్‌’లోని ఒక సీన్‌ ఆధారంగా ఈ పోస్టర్‌ను రూపొందించినట్టు కనిపిస్తోంది. తల కు వస్త్రం చుట్టుకున్న ఓ వ్యక్తి ఎదురుగా రోబో నిల్చొని ఈ హెచ్చరిక చేస్తున్నట్టు పోస్టర్‌లో కనిపిస్తోంది. ‘మిస్టర్‌ సింగ్‌.. స్వచ్ఛందంగా ఈ దేశం నుంచి వెళ్లిపోండి.. లేకుంటే ఎదురయ్యే పరిణామాలు తెలుసుకోండి. మా రోడ్లను వీడండి. వాహనం ఎలా నడపాలో మీకు రాదు’ అని పోస్టర్‌లో పేర్కొన్నారు. అమెరికాలో ఇటీవ ల జరిగిన పలు రోడ్డు ప్రమాదాలకు కారణమైన ట్రక్కు డ్రైవర్లను సరైన పత్రాలు లేని భారతీయులుగా గుర్తించిన నేపథ్యంలో డ్రైవింగ్‌ అంశా న్ని తాజా పోస్టర్‌లో ప్రస్తావించినట్టు భావిస్తున్నారు. వరుస ట్రక్కు ప్రమాదాల నేపథ్యంలో కమర్షియల్‌ డ్రైవింగ్‌ లెసెన్సుల నిబంధనలను కట్టుదిట్టం చేస్తున్నారు.


కొన్ని రకాల వర్క్‌ పర్మిట్లను నిలిపివేశారు. కాగా, డీహెచ్‌ఎస్‌ పోస్టర్‌పై ఆన్‌లైన్‌లో వాడీవేడిగా కామెంట్లు వస్తున్నాయి. ఇది భారతీయులను అమెరికా నుంచి పంపించేసే సంకేతమని, భారతీయ అమెరికన్లపై విద్వేషాలను ప్రేరేపించే చర్యని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ చర్యను ది హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ ఖండించింది. ‘ఇది భారత వ్యతిరేక ప్రొఫైలింగ్‌.. సిక్కులూ హిందువులే. వారు అమెరికన్లు. వాహనాలను నడపగలరు. డీహెచ్‌ఎస్‌ చేపట్టిన జాతివివక్ష, భారత వ్యతిరేక చర్య మన దేశ సమష్టి భావనకు విఘాతం కలిగించనుంది’ అని ‘ఎక్స్‌’లో పేర్కొంది. ఈ పోస్టర్‌పై ఎఫ్‌బీఐ(ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) దర్యాప్తు చేపట్టాలని ది హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ కోరింది. కాగా పేరు చివర సింగ్‌ ఉన్న ప్రతి ఒక్కరినీ అవమానించేలా ఈ పోస్టర్‌ ఉందని ఫాక్స్‌-7 న్యూస్‌ యాంకర్‌ అలక్‌ నోలన్‌ విమర్శించారు. ఇది జాతి వివక్ష పోస్టర్‌ అని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. పోస్టర్‌పై సిక్కులు మండిపడ్డారు. ‘9/11 దాడి జరిగి 25 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ సిక్కులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. లక్షలాదిమంది సిక్కులు అమెరికాలో ఉన్నారు. సింగ్‌ అంటే సింహం అని అర్థం. మాపై శత్రువులనే ముద్ర వేసినా.. నిర్భయంగా సిక్కు గుర్తింపుతోనే ఉంటాం’ అని ఎక్స్‌లో స్పష్టం చేశారు.

Updated Date - Sep 11 , 2026 | 05:24 AM