ఇరాన్‌లోకి అమెరికా ప్రత్యేక బలగాలు!
ABN , Publish Date - Mar 09 , 2026 | 04:47 AM
ఇరాన్‌పై ఇప్పటికే భీకర దాడులతో విరుచుకుపడుతున్న అమెరికా.. ఇప్పుడు అక్కడి అత్యంత విలువైన యురేనియం నిల్వలపై కన్నేసింది.
యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకే.. ఇప్పటికే ఇజ్రాయెల్‌తో ఈ అంశంపై చర్చ!
ఇరాన్ నుంచి యురేనియం తరలింపు లేదా ధ్వంసం చేయడం ద్వారా అణ్వాయుధాల తయారీ అడ్డుకునే యోచన
ప్రచారానికి బలం చేకూర్చేలా అమెరికా రక్షణ మంత్రి హెగ్సేత్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, మార్చి 8: ఇరాన్‌పై ఇప్పటికే భీకర దాడులతో విరుచుకుపడుతున్న అమెరికా.. ఇప్పుడు అక్కడి అత్యంత విలువైన యురేనియం నిల్వలపై కన్నేసింది. ఇందుకోసం తమ సైన్యం నుంచి ప్రత్యేక బలగాలను ఇరాన్‌కు పంపించి వాటిని స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ఇజ్రాయెల్‌తో కూడా చర్చించినట్లు ఓ మీడియా సంస్థ పేర్కొంది. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం చివరి దశలో ఈ ఆపరేషన్ చేపట్టాలన్న యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఈ చర్య చేపట్టనున్నట్లు సమాచారం. ఆ మీడియా సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇరాన్‌లోని అణు సామగ్రిని రెండు విధానాల ద్వారా స్వాధీనం చేసుకునేందుకు అమెరికా సిద్ధమవుతోంది. మొదటి విధానంలో.. ప్రత్యేక బలగాలతో యురేనియం నిల్వను స్వాధీనం చేసుకొని, 450 కిలోల నుంచి 460 కిలోల యురేనియంను అక్కడి నుంచి తరలించనుంది. రెండో విధానంలో.. ప్రత్యేక బలగాల వెంట నిపుణులను పంపించి, యురేనియంను అక్కడే రసాయన చర్య ద్వారా డైల్యూట్ చేసి ఆయుధాల తయారీకి పనికిరాకుండా చేస్తారు. కాగా, అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. అమెరికాను, ఆ దేశ పౌరులను ఎవరైనా లక్ష్యంగా చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘‘ఈ భూమి మీద ఎవరైనా, ఎక్కడైనా అమెరికా పౌరులను చంపినా, బెదిరించినా.. వారిని మేం వేటాడుతాం. ఏమాత్రం కనికరం లేకుండా చంపేస్తాం’’ అని పీట్ హెగ్సేత్ అన్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఈ వ్యాఖ్యలతోపాటు ప్రస్తుతం తమ సైన్యం చేపడుతున్న కార్యకలాపాలకు సంబంధించిన వీడియో క్లిప్‌లనూ పోస్ట్ చేశారు. హెగ్సేత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసేలా ఉన్నాయి. ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ నాయకత్వాన్ని తాము పూర్తిగా తుడిచిపెట్టామని, ప్రపంచానికి పట్టిన క్యాన్సర్‌ను నిర్మూలించామని అన్నారు.
బహ్రెయిన్‌లో 21 మంది అమెరికా సైనికుల మృతి!
బహ్రెయిన్‌లోని అమెరికా నేవీ 5వ ఫ్లీట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో 21 మంది అమెరికా సైనికులు మృతిచెందినట్టు టెహ్రాన్ టైమ్స్ పేర్కొంది. బహ్రెయిన్ రాజధాని మనామాకు సమీపంలోని జుఫైర్ ప్రాంతంలో అమెరికా నావికాదళ సపోర్ట్ యాక్టివిటీ (ఎన్‌ఎస్ఏ) స్థావరం ఉంది. పశ్చిమాసియా, అరేబియా సముద్ర ప్రాంతాల్లో అమెరికా నౌకా దళం కదలికలను, వాణిజ్య నౌకల రాకపోకలను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. అక్కడే అమెరికా నేవీ 5వ ఫ్లీట్ దళం ప్రధాన కార్యాలయం కూడా ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టిన ఫిబ్రవరి 28వ తేదీ నుంచే ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని.. క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఆ దాడుల్లో ఇప్పటికే పలు రాడార్ వ్యవస్థలు, కమాండ్ సెంటర్, శాటిలైట్ కమ్యూనికేషన్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి.