Share News

యుద్ధం కొనసాగించాలంటే..18.6 లక్షల కోట్లు కావాల్సిందే!

ABN , Publish Date - Mar 20 , 2026 | 05:02 AM

పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధానికి దిగిన అమెరికా.. అందుకు భారీఎత్తున ఖర్చు పెడుతోంది.

యుద్ధం కొనసాగించాలంటే..18.6 లక్షల కోట్లు కావాల్సిందే!

  • వైట్‌హౌస్‌ను కోరిన అమెరికా రక్షణ శాఖ

వాషింగ్టన్‌, మార్చి 19: పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధానికి దిగిన అమెరికా.. అందుకు భారీఎత్తున ఖర్చు పెడుతోంది. ఇరాన్‌పై దాడులకు ఇప్పటికే వందల కోట్ల డాలర్లు ఆవిరయ్యాయి. యుద్ధాన్ని కొనసాగించేందుకు అగ్రరాజ్యం ప్రణాళికలు వేసుకుంటోంది. పశ్చిమాసియా రీజియన్‌లో మరిన్ని బలగాలను మోహరించేందుకు సిద్ధమవుతున్న క్రమంలో 20 వేల కోట్ల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.18.6 లక్షల కోట్లు) నిధులు ఇవ్వాలని, దీన్ని కాంగ్రెస్‌ ఆమోదించేలా చూడాలని అమెరికా రక్షణ శాఖ వైట్‌హౌస్‌ను కోరినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనికి వైట్‌హౌస్‌ స్పందన తెలియరాలేదు. అయితే రక్షణ శాఖ అభ్యర్థనను కాంగ్రెస్‌ తిరస్కరించే అవకాశం ఉన్నట్లు ట్రంప్‌ ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోందని, యుద్ధాన్ని ప్రారంభించడంపై డెమొక్రాట్లు ఇప్పటికే ట్రంప్‌పై విమర్శలు చేస్తున్నారని మీడియా కథనాలు నివేదించాయి. ఇరాన్‌తో ఘర్షణ మొదలైన తర్వాత మొదటి 100 గంటల్లోనే 370 కోట్ల డాలర్ల మేర ఖర్చయిందని, మొత్తంగా మొదటి వారంలో అమెరికాకు 1,100 కోట్ల డాలర్లు వ్యయం అయినట్లు ఓ అధ్యయనం పేర్కొంది. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ మరిన్ని నిధులు కావాలని అడగడం ద్వారా హోర్ముజ్‌ జలసంధిపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా, అందుకు దీర్ఘకాల యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. కాగా, పశ్చిమాసియాలో వేలాది మంది బలగాలను మోహరించేందుకు ట్రం ప్‌ ప్రభుత్వం సిద్ధమవుతోందని రాయిటర్స్‌ నివేదిక ఇటీవల పేర్కొంది. హోర్ముజ్‌ జలసంధి దిగ్బంధనాన్ని ఎత్తివేయకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరించారు.


39 లక్షల కోట్ల డాలర్లకు అమెరికా అప్పు

మరోవైపు అమెరికా రుణ ఊబిలో కూరుకుపోతోంది. బుధవారం నాటికి దేశ అప్పులు రికార్డు స్థాయిలో 39 లక్షల కోట్ల డాలర్లను దాటాయి. గత ఏడు నెలల వ్యవధిలో 2 లక్షల కోట్ల డాలర్ల అప్పు అమెరికన్ల నెత్తిన పడింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రారంభమైన మూడు వారాల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పెరుగుతున్న ప్రభుత్వ అప్పుల వల్ల అమెరికన్లపై పలు ప్రతికూల ప్రభావాలు పడుతాయని ప్రభుత్వ జవాబుదారీ కార్యాలయం వివరించింది. అందులో మోర్టగేజ్‌లు, కార్ల రుణాల వంటి వాటిపై అధిక వడ్డీ, పెట్టుబడి పెట్టడానికి వ్యాపారాలకు తక్కువ డబ్బు అందుబాటులో ఉండడం కారణంగా వేతనాలు తగ్గడంతో పాటు వస్తువులు, సేవల ధరలు పెరగడం వంటివి ఉన్నాయి. దీర్ఘకాలంలో మరిన్ని అప్పులు చేయడం, అధిక వడ్డీ చెల్లింపుల ధోరణి భవిష్యత్తులో అమెరికన్లను మరింత కఠిన ఆర్థిక సర్దుబాట్లకు బలవంతం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పీటర్‌ జీ పీటర్‌సన్‌ ఫౌండేషన్‌ అనే ఎన్జీవో సంస్థ చైర్మన్‌, సీఈవో మిచెల్‌ పీటర్‌సన్‌ మాట్లాడుతూ.. తర్వాతి తరంపై వేస్తున్న ఆందోళనకరమైన అప్పుల భారాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా.. ట్రిలియన్‌ డాలర్ల కొద్దీ అప్పులు చేయడం నిలకడలేనితనానికి నిదర్శనమన్నారు. రిపబ్లికన్‌, డెమొక్రటిక్‌ రెండు పార్టీలకు చెందిన అధ్యక్షుల హయాంలో పెరుగుతూ వచ్చిన అప్పులు.. ఇటీవలి కాలంలో యుద్ధాలు, మహమ్మారిపై భారీస్థాయిలో వ్యయం, పన్ను కోతల కారణంగా మరింత పెరిగాయి.

Updated Date - Mar 20 , 2026 | 05:02 AM