Share News

రుణ ఊబిలో అమెరికన్లు

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:46 AM

అమెరికన్లు అప్పుల భారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించలేక చతికిలపడుతున్నారు. అమెరికన్‌ కుటుంబాల రుణభారం గత మూడేళ్లలో మరింత పెరిగిపోయి..

రుణ ఊబిలో అమెరికన్లు

  • అప్పులు కట్టలేని స్థితిలో 20శాతం కుటుంబాలు

  • ప్రతి కొనుగోలుకూ.. బైనౌ పేలేటర్‌

  • 18-29 ఏళ్ల వారిలో ఈ ధోరణి ఎక్కువ

  • యూఎస్‌ ఫెడ్‌ తాజా నివేదిక వెల్లడి

వాషింగ్టన్‌, అక్టోబర్‌ 11: అమెరికన్లు అప్పుల భారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించలేక చతికిలపడుతున్నారు. అమెరికన్‌ కుటుంబాల రుణభారం గత మూడేళ్లలో మరింత పెరిగిపోయి.. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనంతరం ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయిలకు చేరింది. ఒకవైపు ఆదాయం స్వల్పంగా మెరుగుపడి, సంపద అసమానతలు కొంత తగ్గినప్పటికీ.. మరోవైపు కుటుంబాల రుణ చెల్లింపుల సామర్థ్యం గణనీయంగా పడిపోయిందనిఫెడరల్‌ రిజర్వ్‌ నిర్వహించిన ‘కన్జ్యూమర్‌ ఫైనాన్స్‌ సర్వే’ వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక క్రమశిక్షణ కొరవడుతోందని సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 2010 తర్వాత (2007-2008 ఆర్థిక మాంద్యం అనంతరం) రుణ చెల్లింపుల్లో అమెరికన్లు ఈ స్థాయిలో వెనకబడడం ఇదే తొలిసారి. కుటుంబాల ఆదాయాలు పెరుగుతున్నప్పటికీ.. అధిక వడ్డీ రేట్లు, ధరల పెరుగుదల ప్రభావంతో రుణాల చెల్లింపులు భారంగా మారుతున్నాయి. 2025 చివరి నాటికి ప్రతి ఐదు కుటుంబాల్లో ఒకటి (20ు) అప్పుల (క్రెడిట్‌ కార్డు, బైనౌ పేలేటర్‌, వ్యక్తిగత రుణాలు) చెల్లింపుల్లో వెనుకబడింది. రెండు నెలలకు మించి రుణ ఈఎంఐలు కట్టలేని వారు 2022 చివరికి (గత సర్వే) 5 శాతంగా ఉంటే, 2025 నాటికి 8 శాతానికి పెరిగారు. ముఖ్యంగా, 18-29 ఏళ్ల వయసు వారు అప్పుల ఊబిలో ఎక్కువగా చిక్కుకుంటున్నారు. మిగతవారితో పోల్చితే రుణ చెల్లింపుల్లో వీరే ఎక్కువగా చేతులెత్తేస్తున్నారు. ఆదాయంలో 40 శాతానికి పైనే రుణ చెల్లింపుల కోసం ఖర్చు చేస్తున్న కుటుంబాల వాటా 2022లో 6.5 శాతంగా ఉండగా, 2025 నాటికి 8.6 శాతానికి పెరిగింది. అంటే సంపాదనలో సగభాగం అప్పులు చెల్లింపులకే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ‘బై నౌ పే లేటర్‌’ (ఇప్పుడు కొను, తర్వాత చెల్లించు) అమెరికన్లకు కీలక రుణ సాధనంగా మారిపోయింది. 2022లో ఈ తరహా సాధనాలను వినియోగించుకున్న వారి వాటా 7 శాతమే ఉండగా, 2025 చివరికి 12 శాతానికి పెరిగింది.


ఆదాయం పెరిగినా.. తప్పని ఆర్థిక కష్టాలు..

2022-2025 మధ్య అధిక ఆదాయం కలిగిన వారి సగటు సంపద విలువ 31శాతం పెరగడం గమనార్హం. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించిన తర్వాత కూడా ఈ కుటుంబాల సగటు ఆదాయం 7శాతం పెరిగి 82,200 డాలర్లకు చేరింది. సగటు నికర సంపద సైతం 2శాతం పెరిగి 2,15,900 డాలర్లకు చేరుకుంది. అయినప్పటికీ ఈ పెరుగుదల కుటుంబాలన్నింటికీ సమానంగా ఆర్థిక భద్రతను కల్పించలేకపోయింది. మొత్తంగా చూస్తే దేశంలో 77శాతం మంది ఏదో ఒక రూపంలో అప్పుల భారాన్ని మోస్తున్నారు.

Updated Date - Oct 12 , 2026 | 04:47 AM