Share News

హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు చట్టవిరుద్ధం

ABN , Publish Date - Jun 09 , 2026 | 03:55 AM

సుంకాల పెంపు విషయంలో ఇప్పటికే ఒకసారి కోర్టులో ఎదురుదెబ్బ తిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.

హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు చట్టవిరుద్ధం

ట్రంప్‌ నిర్ణయాన్ని కొట్టేస్తూ యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు జడ్జి తీర్పు

బోస్టన్‌, జూన్‌ 8: సుంకాల పెంపు విషయంలో ఇప్పటికే ఒకసారి కోర్టులో ఎదురుదెబ్బ తిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు ఇచ్చే హెచ్‌-1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని బోస్టన్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి లియో సోరోకిన్‌ కొట్టివేశారు. హెచ్‌-1బీ వీసా దరఖాస్తులకు 2 వేల డాలర్ల నుంచి 5 వేల డాలర్ల దాకా ఉన్న ఫీజును ట్రంప్‌ ఏకంగా లక్ష డాలర్లకు పెంచేస్తూ గత ఏడాది సెప్టెంబరులో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన 20 మంది స్టేట్‌ అటార్నీ జనరల్స్‌ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జడ్జి లియోసోరోకిన్‌.. పార్లమెంటు ఆమోదం లేకుండా అమెరికా అధ్యక్షుడు ఇంత భారీ ఫీజును విధించడం చట్టవిరుద్ధమని తీర్పు ఇచ్చారు. అమెరికాలోకి నిర్ణీత విదేశీయుల రాకను నియంత్రించడానికి ఫెడరల్‌ ఇమ్మిగ్రేషన్‌ చట్టం ప్రకారం అధ్యక్షుడికి ఉన్న అధికారాల పరిధిలోనే ఈ ఆర్థిక జరిమానా విధించామని ట్రంప్‌ సర్కారు వినిపించిన వాదనలను ఆయన తోసిపుచ్చారు. ఆ ఫీజు పెనాల్టీ కాదని.. పన్నే అని, కాంగ్రెస్‌ (పార్లమెంటు) అనుమతి లేకుండా విధించారని తేల్చిచెప్పారు.

Updated Date - Jun 09 , 2026 | 03:55 AM