Share News

రా, ఆరెస్సెస్‌పై ఆంక్షలు విధించండి

ABN , Publish Date - Mar 17 , 2026 | 03:43 AM

భారతదేశంలో మతస్వేచ్ఛ నానాటికీ క్షీణిస్తోందంటూ అమెరికా ప్రభుత్వానికి చెందిన ‘మతస్వేచ్ఛపై అంతర్జాతీయ కమిషన్‌...

రా, ఆరెస్సెస్‌పై ఆంక్షలు విధించండి

  • భారతదేశంలో మతస్వేచ్ఛ క్షీణిస్తోంది

  • అమెరికా ప్రభుత్వ కమిషన్‌ నివేదిక

  • తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం

న్యూయార్క్‌, న్యూఢిల్లీ, మార్చి 16: భారతదేశంలో మతస్వేచ్ఛ నానాటికీ క్షీణిస్తోందంటూ అమెరికా ప్రభుత్వానికి చెందిన ‘మతస్వేచ్ఛపై అంతర్జాతీయ కమిషన్‌ (యూఎస్సీఐఆర్‌ఎఫ్‌)’ నివేదిక ఇచ్చింది. ‘‘మతపరమైన మైనారిటీ సమాజాలను, వారి ప్రార్థనామందిరాలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న కొత్త చట్టాల కారణంగా 2025లో కూడా ఇండియాలో మతస్వేచ్ఛ క్షీణించింది’’ అని ఆ నివేదికలో పేర్కొంది. కఠినమైన మతమార్పిడి వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టడం లేదా జైలు శిక్షలను చేర్చడం ద్వారా.. ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేసేందుకు చాలా రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయని అందులో వెల్లడించింది. పౌరులను, మతపరమైన శరణార్థులను నిర్బంధించడానికి, వారిని అక్రమంగా బహిష్కరించడానికి అధికారులు సహకరించారని.. మతపరమైన మైనారిటీలపై జరిగే విచక్షణరహిత దాడులను అనుమతించారని పేర్కొంది. ఈ విషయంలో న్యూఢిల్లీ తన రికార్డును మెరుగుపరచుకుంటేనే.. భారత్‌కు వాషింగ్టన్‌ భవిష్యత్తులో అందించే భద్రతాసాయాన్ని, భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కొనసాగించాలని యూఎస్‌ ప్రభుత్వానికి సూచించింది. మతస్వేచ్ఛకు సంబంధించి తీవ్ర ఉల్లంఘనలకు బాధ్యులైన వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించాలని, ఆస్తులను స్తంభింపజేయడం, అమెరికాలోకి ప్రవేశాన్ని నిషేధించడం వంటి చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. నివేదికలో పేర్కొన్న వ్యక్తులు, సంస్థల్లో.. భారత గూఢచార సంస్థ రిసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా), ఆరెస్సెస్‌ ఉండడం గమనార్హం. అయితే, యూఎస్సీఐఆర్‌ఫ్‌ 2026వార్షిక నివేదికలో.. దురుద్దేశపూర్వకంగా, పక్షపాతంతో భారత్‌పై చేసిన వ్యాఖ్యలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు. యూఎ్‌ససీఐఆర్‌ఎఫ్‌ చాలా ఏళ్లుగా ఇలా భారత్‌ను తప్పుగా చిత్రీకరిస్తూ వస్తోందని.. ఇండియాలో మతస్వేచ్ఛకు సంబంధించి నిష్పాక్షిక వాస్తవాలపై ఆధారపడకుండా సందేహాస్పద మూలాలపై ఆధారపడి ఇలాంటి నివేదికలు ఇస్తోందని మండిపడ్డారు. తప్పుదారి పట్టించే ఇలాంటి వ్యాఖ్యలను పదేపదే చేయడం వల్ల ఆ కమిషన్‌ విశ్వసనీయతే దెబ్బతింటుందన్నారు. భారత్‌ విమర్శించడం మాని.. అమెరికాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపైన, ఆ దేశంలో భారతీయులపై పెరుగుతున్న అసహనంపైనా దృష్టి పెట్టాలని సూచించారు.

Updated Date - Mar 17 , 2026 | 03:43 AM