అమెరికా సైన్యాధ్యక్షుడికి ఉద్వాసన
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:30 AM
ఇరాన్‌తో యుద్ధంలో పీకల్లోతు కూరుకుపోయి నానా తంటాలు పడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తన వైఫల్యాలను సైనిక, పరిపాలనా అధికారులపై మోపేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు కనిపిస్తోంది.
రక్షణ మంత్రి ఆదేశాలతో జనరల్ రాండీ జార్జ్ పదవీ విరమణ
కొత్త సైన్యాధ్యక్షుడిగా క్రిస్టోఫర్ లానెవె
వాషింగ్టన్, ఏప్రిల్ 3: ఇరాన్‌తో యుద్ధంలో పీకల్లోతు కూరుకుపోయి నానా తంటాలు పడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తన వైఫల్యాలను సైనిక, పరిపాలనా అధికారులపై మోపేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు కనిపిస్తోంది. రక్షణ మంత్రి చెబితేనే యుద్ధం మొదలుపెట్టానని గతంలోనే ప్రకటించిన ఆయన.. మిలిటరీలోని అత్యున్నత స్థాయి అధికారులను ఎడాపెడా తొలగిస్తున్నారు. ఏకంగా సైన్యాధ్యక్షుడికే ఉద్వాసన పలికారు. అమెరికా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ రాండీ జార్జ్‌ను బలవంతంగా పదవీ విరమణ చేయించారు. 2023లో సైన్యాధ్యక్ష పదవి చేపట్టిన ఆయన.. వాస్తవానికి 2027 వరకు ఆ పదవిలో కొనసాగాలి. కానీ, వెంటనే పదవీ విరమణ చేయాలని జార్జ్‌ను రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సేథ్ శుక్రవారం ఆదేశించారు. జార్జ్ రిటైర్మెంట్ వెంటనే అమల్లోకి వస్తుందని సైనిక ప్రధాన కార్యాలయం పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ ప్రకటించారు. జార్జ్ స్థానంలో కొత్త సైన్యాధ్యక్షుడిగా జనరల్ క్రిస్టోఫర్ లానెవెను నియమించారు. సైన్యాధ్యక్షుడితోపాటు సైన్యం శిక్షణ విభాగం అధిపతి జనరల్ డేవిడ్ హోడ్నీ, చాప్లైన్ కార్ప్స్ డైరెక్టర్ మేజర్ జనరల్ విలియం గ్రీన్ జూనియర్‌లను కూడా ఉద్యోగాల నుంచి తొలగించారు. మరికొంత మంది కీలక అధికారులకు కూడా పదవీ గండం పొంచి ఉన్నట్లు సమాచారం. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసీ గబార్డ్, సైన్యం కార్యదర్శి డేనియల్ డ్రిస్‌కోల్, కార్మిక శాఖ కార్యదర్శి లోరీ ఛావెజ్ డీరెమెర్‌లను కూడా పదవుల నుంచి తొలగించే అవకాశం ఉందని అమెరికా మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.
యుద్ధ వైఫల్యమే కారణమా?
ఇరాన్‌తో యుద్ధంలో తన వైఫల్యాన్ని అధికారులపైకి నెట్టేందుకే ఉన్నత స్థాయి అధికారులను ట్రంప్ పదవుల నుంచి తొలగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. రక్షణ మంత్రి హెగ్‌సేథ్ కూడా మిలిటరీ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకొంటూ తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాండీ జార్జ్‌తో ఆయనకు విబేధాలు రావటం వల్లనే అర్థంతరంగా పదవి నుంచి తొలగించారనే వాదన కూడా వినిపిస్తోంది. కొందరు సైనికాధికారుల ప్రమోషన్ల విషయంలో ఈ ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయని సమాచారం.
అమెరికా రక్షణ బడ్జెట్ 1.5ట్రిలియన్ డాలర్లు!
రక్షణ శాఖకు భారీగా నిధులు కేటాయిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. 2027 సంవత్సరానికి 1.5 ట్రిలియన్ డాలర్లు (రూ.1,500 లక్షల కోట్లు) కేటాయించాలని ప్రతిపాదించారు. ఈ కారణంగా సంక్షేమ పథకాల నిధుల్లో 10ు మేర కోత పడే సూచనలు ఉన్నాయి.