సుంకాల కోసం ‘వాణిజ్య దర్యాప్తు’!
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:19 AM
చైనా, భారత్‌తోపాటు 16 భాగస్వామ్య దేశాల మీద కొత్త సుంకాల విధింపునకు ‘వాణిజ్య దర్యాప్తు’ ప్రారంభిస్తామని అమెరికా ప్రకటించింది.
భారత్, చైనాతోపాటు 16 దేశాలపై జరుపుతాం : అమెరికా వాణిజ్య ప్రతినిధి
వాషింగ్టన్, మార్చి 12: చైనా, భారత్‌తోపాటు 16 భాగస్వామ్య దేశాల మీద కొత్త సుంకాల విధింపునకు ‘వాణిజ్య దర్యాప్తు’ ప్రారంభిస్తామని అమెరికా ప్రకటించింది. అమెరికా వాణిజ్య చట్టం 1974లోని సెక్షన్ 301 ప్రకారం ఈ చర్యలు తీసుకోనున్నామని పేర్కొంది. పలు దేశాల మీద అధ్యక్షుడు ట్రంప్ విధించిన పరస్పర సుంకాలను చట్టవ్యతిరేకమైనవిగా పేర్కొంటూ వాటిని అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుంకాల పునరుద్ధరణకు కొత్త దారులు వెదుకుతున్న ట్రంప్ యంత్రాంగం తాజా ప్రకటన చేసింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీసన్ గ్రీర్ ఈ వివరాలు వెల్లడిస్తూ.. భారత్, చైనా, ఈయూ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, తైవాన్, వియత్నాం, థాయ్‌లాండ్, మలేసియా, కంబోడియా, సింగపూర్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, స్విట్జర్లాండ్, నార్వేల మీద వాణిజ్య దర్యాప్తు జరపనున్నట్లు తెలిపారు. అమెరికా ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. కాగా, ఈ 16 ఆర్థిక వ్యవస్థలతో అమెరికాకు భారీగా వాణిజ్యలోటు కొనసాగుతోందని, అమెరికా విధించే పన్నులకన్నా అవి విధించే పన్నులు చాలా ఎక్కువని అమెరికా తొలి నుంచీ చెబుతోంది. సుప్రీంకోర్టు తీర్పుతో సుంకాల రద్దు కావటం వల్ల.. తిరిగి వాటిని విధించటానికి వాణిజ్య దర్యాప్తు అస్త్రాన్ని బయటకు తీసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా.. అన్ని భాగస్వామ్య పక్షాల లిఖితపూర్వక వాదనలు ఏప్రిల్ 15వ తేదీ వరకూ స్వీకరిస్తామని, మే 5న బహిరంగ విచారణ జరుపుతామని, సంబంధిత దేశాలను సంప్రదిస్తామని గ్రీర్ తెలిపారు. అన్యాయమైన వాణిజ్య విధానాలను సరి చేయటానికి, వాణిజ్య లోటును సరిదిద్దటానికి, అమెరికా తయారీరంగాన్ని కాపాడటానికి ప్రెసిడెంట్ ట్రంప్ ఈ చర్యలు తీసుకుంటున్నారని గ్రీర్ తెలియజేశారు. కాగా, వాణిజ్య దర్యాప్తు జరుపుతామన్న అమెరికా ప్రకటనతో ఇరు దేశాల వాణిజ్య ఒప్పందం చర్చల మీద ప్రభావం ఉంటుందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
వెట్టి చాకిరీ ఉత్పత్తులపై ఆంక్షలు
వెట్టి చాకిరీతో తయారైన ఉత్పత్తులు అమెరికాకు దిగుమతి అవుతున్నాయా అన్న అంశంపైనా మరొక దర్యాప్తు జరుపుతామని గ్రీర్ వెల్లడించారు. దీని కింద 60దేశాల ఉత్పత్తుల మీద దర్యాప్తు జరిగే అవకాశం ఉందని అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. చైనాలోని జిన్‌జియాంగ్ రాష్ట్రంలో ఉగ్యుర్ తదితర మైనారిటీలను లేబర్‌క్యాంపులకు తరలించి వారితో వెట్టిచాకిరీ చేయిస్తూ ఉత్పత్తులను పెంచుతున్నారని అమెరికా గతంలో ఆరోపించింది. వాటిని చైనా ఖండించింది. జిన్‌జియాంగ్ ప్రాంతంలో తయారయ్యే సోలార్ ప్యానల్స్ తదితర ఉత్పత్తులపై ఇంతకు ముందటి అధ్యక్షుడు బైడెన్ హయాంలోనే అమెరికా ఆంక్షలు విధించింది. వీటిని ప్రస్తుతం పలు ఇతర దేశాలపైనా విధించే యోచనలో ట్రంప్ యంత్రాం గం ఉన్నట్లు తాజా నిర్ణయంతో తెలుస్తోంది.