ఇరాన్ అణుకేంద్రాలపై దాడులు
ABN , Publish Date - Mar 28 , 2026 | 04:36 AM
పశ్చిమాసియాలో యుద్ధం ఉధృతంగా కొనసాగుతోంది. ఇరాన్‌లోని కీలకమైన షాహిద్ భారజల కర్మాగారం, అర్డకాన్ యెల్లో కేక్...
రెండు ఉక్కు కర్మాగారాలూ ధ్వంసం
ఇళ్లపై దాడులతో 31 మంది మృతి
వాషింగ్టన్, మార్చి 27: పశ్చిమాసియాలో యుద్ధం ఉధృతంగా కొనసాగుతోంది. ఇరాన్‌లోని కీలకమైన షాహిద్ భారజల కర్మాగారం, అర్డకాన్ యెల్లో కేక్(ముడి యురేనియం) నిల్వ కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేశాయి. మరోవైపు ఇరాన్ బుషెహర్ అణువిద్యుత్ కేంద్రంపై దాడి నేపథ్యంలో అణు ధార్మికత లీకయ్యే ప్రమాదం ఉందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దానివల్ల ఇరాన్‌తోపాటు సమీప దేశాలకు రేడియేషన్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. అణు, ఉక్కు ప్లాంట్లపై దాడులను ఇరాన్ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రతిగా భారీ దాడులు చేపడతామని ప్రకటించింది. ఇరాన్‌లోని ఖుజెస్తాన్, మొబారకే ఉక్కు కర్మాగారాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయని.. రెండు ప్లాంట్లకూ నష్టం జరిగిందని ఇరాన్ తెలిపింది. ఇరాన్‌లోని ఖోమ్‌లో నివాస భవనాలపై దాడి జరిగింది. పిల్లలు, మహిళలు సహా 18 మంది మృతిచెందారని అధికారులు వెల్లడించారు. మరోవైపు యామ్చి పట్టణంలోని నివాస ప్రాంతంలో క్షిపణి దాడిలో ఇద్దరు చిన్నారులు సహా 13 మంది మృతిచెందారు. ఇదిలా ఉండగా, అమెరికా స్థావరాలు, సైనికులు ఉన్న చోటికి దూరంగా ఉండాలని పశ్చిమాసియా దేశాల్లోని ప్రజలకు ఐఆర్‌జీసీ సూచించింది. అమెరికా సైనికులు ఎక్కడున్నా దాడులు చేస్తామని హెచ్చరించింది.