టొమాహాక్‌లు, బంకర్ బస్టర్లు, బాలిస్టిక్ క్షిపణులు
ABN , Publish Date - Mar 01 , 2026 | 03:22 AM
ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా క్షిపణి దాడులకు పాల్పడ్డాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాన్ని నడిపిస్తున్న ఆయుధాలు ఇవే!
టెహ్రాన్, ఫిబ్రవరి 28: ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన టొమాహాక్ క్రూయిజ్ క్షిపణులు అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణించి ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను చేధించాయి. రాడార్లకు చిక్కని ఎఫ్-35ఐ అదిర్ స్టెల్త్ యుద్ధ విమానాలు, భూగర్భంలోని బంకర్లను చీల్చుకుపోయే జీబీయూ-28 బంకర్ బస్టర్ బాంబులు ఇరాన్‌లోని టెహ్రాన్, ఇస్ఫహాన్ వంటి ప్రధాన నగరాల్లోని వ్యూహాత్మక స్థావరాలను ధ్వంసం చేశాయి. వీటితో పాటు ఇజ్రాయెల్ స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన రాంపేజ్, డెలిలా క్షిపణులు, జీపీఎస్ సిగ్నల్స్ లేకున్నా లక్ష్యాన్ని చేధించే స్పైస్ స్మార్ట్ బాంబులు ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించాయి. ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా తన బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. షహాబ్-3, ఎమాద్ వంటి శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ సరిహద్దులపై దాడి చేసింది. అంతేకాకుండా బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఇలా ఇరుపక్షాలు అత్యాధునిక సాంకేతికత కలిగిన క్షిపణులు, బాంబులను వాడడంతో పశ్చిమాసియా భగ్గుమంది.