Share News

రెండు రోజుల ముందే డీల్‌

ABN , Publish Date - Jun 19 , 2026 | 02:51 AM

అమెరికా, ఇరాన్‌ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముందుగా నిర్ణయించిన తేదీకంటే రెండు రోజుల ముందే అమల్లోకి వచ్చింది.

రెండు రోజుల ముందే డీల్‌

  • ఎంవోయూపై అమెరికా, ఇరాన్‌ అధ్యక్షుల సంతకాలు

  • శుక్రవారం స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన ఒప్పందం

  • బుధవారమే సంతకాలు చేసిన ట్రంప్‌, పెజెష్కియాన్‌

  • గ్యారెంటర్‌గా సంతకం చేసిన పాక్‌ ప్రధాని షరీఫ్‌

న్యూఢిల్లీ, జూన్‌ 18: అమెరికా, ఇరాన్‌ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముందుగా నిర్ణయించిన తేదీకంటే రెండు రోజుల ముందే అమల్లోకి వచ్చింది. స్విట్జర్లాండ్‌లో శుక్రవారం ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు లాంఛనంగా సంతకాలు చేస్తారని ముందుగా ప్రకటించారు. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌లు బుధవారమే ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. జీ7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఫ్రాన్‌ వెళ్లిన ట్రంప్‌.. బుధవారం వర్సైల్స్‌ ప్యాలె్‌సలో ఆ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఆ విందు కార్యక్రమంలోనే మేక్రాన్‌ సమక్షంలో ఎంవోయూ పత్రంపై ట్రంప్‌ సంతకం చేశారు. ఆయన సంతకం చేస్తున్న వీడియోను అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్‌ విడుదల చేసింది. మరోవైపు టెహ్రాన్‌లో ఇరాన్‌ అధ్యక్షుడు ఎంవోయూపై సంతకం చేస్తున్న దృశ్యాన్ని ఆ దేశ మీడియా సంస్థ ఇర్నా ప్రసారం చేసింది. రెండు దేశాల అధ్యక్షులు సంతకాలు చేయటంతో ఎంవోయూ బుధవారం నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో హోర్ముజ్‌ జలసంధిని వాణిజ్య నౌకల రాకపోకల కోసం ఇరాన్‌ గురువారం తెరిచింది. ఇరాన్‌ పోర్టుల దిగ్బంధనాన్ని అమెరికా నౌకాదళం ఉపసంహరిస్తోంది. మరోవైపు ఎంవోయూపై పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ కూడా గురువారం సంతకం చేశారు. తాత్కాలిక శాంతి ఒప్పందానికి హామీదారు (గ్యారెంటర్‌)గా ప్రధాని షరీఫ్‌ సంతకం చేశారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయన సంతకం చేస్తున్న వీడియోను కూడా విడుదల చేసింది. ఎంవోయూపై ముందుగానే సంతకాలు పూర్తి కావటంతో నేడు స్విట్జర్లాండ్‌లో జరిగే కార్యక్రమం నామమాత్రమే కానుంది. ఈ కార్యక్రమంలో పాక్‌, ఇరాన్‌, అమెరికా, ఖతార్‌ దేశాల ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ ఒప్పందం 60 రోజులు అమల్లో ఉంటుంది. ఈ లోపు శాశ్వత సంధి కోసం ఇరు దేశాలు చర్చలు జరుపుతాయి. అవసరమైతే ఏకాభిప్రాయంతో ఒప్పందాన్ని పొడిగించుకోవచ్చు. కాగా, హోర్ముజ్‌ జలసంధిని తెరిచినప్పటికీ వాణిజ్య నౌకల రాకపోకలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రపంచ వాణిజ్య నౌకా రవాణా పర్యవేక్షణ సంస్థ కెప్లర్‌ తెలిపింది. జలసంధిలో యుద్ధానికి పూర్వపు పరిస్థితి రావటానికి దాదాపు నెల సమయం పడుతుందని పేర్కొంది.

Updated Date - Jun 19 , 2026 | 02:51 AM