వీసాల్లో ‘అమెరికా ఫస్ట్’ రూల్
ABN , Publish Date - May 24 , 2026 | 04:04 AM
భారతీయులకు అమెరికా వీసాల జారీలో ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని అమలుచేయనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు.
మా దేశానికి ప్రయోజనం చేకూర్చేవారికే ప్రాధాన్యం
పారిశ్రామికవేత్తలకు వేగంగా వీసాలు: రుబియో
ప్రధాని మోదీతో భేటీ.. వాణిజ్యం, రక్షణ అంశాలపై చర్చ
న్యూఢిల్లీ, మే 23: భారతీయులకు అమెరికా వీసాల జారీలో ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని అమలుచేయనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. తమ దేశానికి ఆర్థిక ప్రయోజనం కలిగించే వ్యక్తులకు మొదటి ప్రాధాన్యతగా వేగంగా వీసాలు జారీచేస్తామని చెప్పారు. నాలుగు రోజుల భారత పర్యటన కోసం శనివారం విచ్చేసిన ఆయన.. దేశంలోని అమెరికా కాన్సులే ట్ల సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా వీసాల జారీలో ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని ప్రారంభించారు. ‘అమెరికాతో సంబంధాలను బలోపేతం చేయగలిగే వ్యక్తులకు వీసాల జారీలో ప్రాఽధాన్యం ఇస్తాం. దీనర్ధం వ్యాపారులు, అమెరికాలో వ్యాపార ఒప్పందాలు చేసుకోవటానికి వెళ్లేవాళ్లు, వ్యాపారాలను విస్తరించేందుకు వెళ్లేవాళ్లు, అమెరికా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే భారతీయ కంపెనీల ప్రతినిధులకు త్వరగా వీసాలు జారీచేయటం’ అని వివరించారు. రుబియో శనివారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. 40 నిమిషాలకు పైగా సాగిన ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, టెక్నాలజీ, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత పెంచటంపై చర్చించారు. అమెరికాలో పర్యటించాల్సిందిగా ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ తరఫున మోదీని రుబియో ఆహ్వానించారు. సమావేశం అనంతరం మోదీ సోషల్‌మీడియాలో ఈ భేటీపై స్పందించారు. ‘ప్రాంతీయ, ప్రపంచ శాంతిభద్రతల గురించి మేము చర్చించాం. ప్రపంచానికి మంచి జరగటం కోసం అమెరికా, భారత్ మరింత సన్నిహితంగా కలిసి పనిచేస్తాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. శనివారం నేరుగా కోల్‌కతా చేరుకున్న రుబియో.. అక్కడ మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ప్రధాన కార్యాలయాన్ని సంద ర్శించారు. మదర్ థెరిసాకు నివాళులు అర్పించారు. ఆయన ఆదివారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.