దాడికి రెడీ!
ABN , Publish Date - Jan 25 , 2026 | 02:43 AM
ఇరాన్‌పై దాడికి అంతా సిద్ధమవుతోంది. యూఎ్‌సఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక యుద్ధ నౌక నేతృత్వంలోని అమెరికా నౌకాదళం ఇరాన్ సమీపానికి చేరుకుంది.
ఇరాన్ సమీపానికి చేరుకున్న అమెరికా యుద్ధ నౌకల బృందం
వాషింగ్టన్/ న్యూఢిల్లీ, జనవరి 24: ఇరాన్‌పై దాడికి అంతా సిద్ధమవుతోంది. యూఎ్‌సఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక యుద్ధ నౌక నేతృత్వంలోని అమెరికా నౌకాదళం ఇరాన్ సమీపానికి చేరుకుంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై దాడి చేసేందుకు వీలైన ప్రాంతంలో సిద్ధంగా ఉన్నట్టు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇక పర్షియన్ గల్ఫ్ ప్రాంతం, బహ్రెయిన్‌లోని సైనిక స్థావరాల్లోని బలగాలనూ అమెరికా అప్రమత్తం చేసింది. పదుల సంఖ్యలో మిలిటరీ రవాణా విమానాలు, యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపే ట్యాంకర్ విమానాలనూ ఆ స్థావరాలకు పంపింది. మరోవైపు అమెరికా మిత్రదేశం యూకే ఖతార్‌లోని స్థావరానికి రక్షణగా పదుల సంఖ్యలో టైఫూన్ జెట్లను తరలించింది. భారీగా మిలిటరీ మోహరింపు నేపథ్యంలో అమెరికా ఎలాంటి దాడికి దిగినా అది పూర్తిస్థాయి యుద్ధమే అవుతుందని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా బలగాల మోహరింపు నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంత దేశాలకు పలు యూరోపియన్ విమానయాన సంస్థలు తమ సర్వీసులు నిలిపివేశాయి. పశ్చిమాసియా మీదుగా ఇతర దేశాలకు నిర్వహించే సర్వీసులను ఇతర మార్గాల మీదుగా మళ్లించాయి. ఇజ్రాయెల్, సౌదీ, దుబాయ్, బహ్రెయిన్‌లకు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు సంస్థలు ప్రకటించాయి.