Share News

రఫేల్‌పై అమెరికా పట్టు

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:44 AM

ఫ్రాన్స్‌ కిరీటంలో కలికి తురాయిగా పేరుపొందిన రఫేల్‌ యుద్ధ విమానాల వ్యవహారం అమెరికా చేతుల్లోకి వెళ్లిపోతోంది! దీనితో ఇకపై రఫేల్‌ పైటర్ల విక్రయాలు....

రఫేల్‌పై అమెరికా పట్టు

  • కీలక విడిభాగాల సరఫరా సంస్థ అమెరికన్‌ కంపెనీ హస్తగతం

  • రఫేల్‌ ఫైటర్ల విక్రయాలు, నిర్వహణలో ఇకపై అమెరికా ప్రభావం!?

  • 114 రఫేల్‌ ఫైటర్లను కొనుగోలు చేయనున్న భారత్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఫ్రాన్స్‌ కిరీటంలో కలికి తురాయిగా పేరుపొందిన రఫేల్‌ యుద్ధ విమానాల వ్యవహారం అమెరికా చేతుల్లోకి వెళ్లిపోతోంది! దీనితో ఇకపై రఫేల్‌ పైటర్ల విక్రయాలు, ఇప్పటికే వివిధ దేశాలకు విక్రయించిన వాటి నిర్వహణపై ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 114 రఫేల్‌ ఫైటర్ల కొనుగోలు కోసం భారత్‌ చేస్తున్న ప్రయత్నాలపై ప్రభావం పడవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఫ్రాన్స్‌కు చెంది దసో ఏవియేషన్‌ సంస్థ రఫేల్‌ ఫైటర్లను అభివృద్ధి చేసింది. వీటికి అవసరమైన కీలక విడిభాగాలు, పరికరాలను ఫ్రాన్స్‌కు చెందిన ఎల్‌ఎంబీ ఏరోస్పేస్‌ సంస్థ సరఫరా చేస్తోంది. తాజాగా ఎల్‌ఎంబీ ఏరోస్పేస్‌ సంస్థను అమెరికాకు చెందిన లోయర్‌ గ్రూప్‌ కొనుగోలు చేసింది. సాధారణంగా అమెరికన్‌ రక్షణ సంస్థలన్నీ ఆ దేశ ‘ఇంటర్నేషనల్‌ ట్రాఫిక్‌ ఇన్‌ ఆర్మ్స్‌ రెగ్యులేషన్స్‌ (ఐటీఏఆర్‌)’ పరిధిలోకి వస్తాయి. దాని ప్రకారం.. అమెరికా ఆంక్షలు ఉన్న దేశాలకు, ఆంక్షలున్న దేశాల నుంచి రక్షణ ఉత్పత్తులు కొనుగోలు చేసే దేశాలకు.. అమెరికన్‌ సంస్థల నుంచి ఎలాంటి రక్షణ ఉత్పత్తులు, పరికరాలను, సాంకేతికతలను అందించడానికి వీలుండదు. ఇప్పుడు ఎల్‌ఎంబీ ఏరోస్పేస్‌ అమెరికన్‌ సంస్థ చేతుల్లోకి రావడంతో.. అది విడిభాగాలు, పరికరాలు సరఫరా చేసే దసో ఏవియేషన్‌ కూడా ‘ఐటీఏఆర్‌’ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే రఫేల్‌ ఫైటర్లను కొన్న, కొనుగోలు చేయాలని చూసే దేశాలపై ప్రభావం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉదాహరణకు నాటో దేశమైన తుర్కియే. గతంలో అమెరికా ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన ఎఫ్‌-35 ఫైటర్ల ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండేది. కానీ తుర్కియే రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసిందని.. ఎఫ్‌-35 ప్రాజెక్టు నుంచి అమెరికా వెళ్లగొట్టింది. ఇక ఫ్రాన్స్‌, స్వీడన్‌ నుంచి యుద్ధ విమానాలు ఏవైనా కొనుగోలు చేస్తే.. నోరాడ్‌ (ఉత్తర అమెరికా ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ కమాండ్‌)లో కెనడా భాగసామ్యం దెబ్బతింటుందని ఆ దేశాన్ని ఇటీవలే ట్రంప్‌ హెచ్చరించారు.


భారత్‌పై ప్రభావం ఉంటుందా?

అమెరికా ఆంక్షలేవీ వర్తించకపోవడం, మెరుగైన సామర్థ్యం ఉండటంతో చాలా దేశాలు రఫేల్‌ విమానాల కొనుగోలుపై దృష్టిపెట్టాయి.భారత్‌ కూడా ఇప్పటికే 36్డఫైటర్లను కొనుగోలు చేసింది. నావికాదళం కోసం 26 రఫేల్‌-ఎం ఫైటర్లకు ఆర్డర్‌ చేసింది. త్వరలోనే వాటి సరఫరా ప్రారంభం కావాల్సి ఉంది. మరో 114 రఫేల్‌ ఫైటర్ల కొనుగోలు కోసం భారత్‌ గతంలోనే ఫ్రాన్స్‌, దసో ఏవియేషన్‌తో అవగాహన ఒప్పం దం కుదుర్చుకుంది. వచ్చే వారం జరగనున్న కేంద్ర రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి (డీఏసీ) భేటీలో దీనిపై చర్చించి ఆమోదించనున్నారు.ఈ నెల మూడో వారంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ భారత్‌లో పర్యటిస్తుండటంతో.. రఫేల్‌ ఫైటర్ల కొనుగోలుపై తుది ఒప్పందం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో దసో ఏవియేషన్‌ అమెరికా ‘ఐటీఏఆర్‌’ పరిధిలోకి వస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారిం ది. ఎందుకంటే అమెరికా ఆంక్షలు ఉన్న రష్యాతో భారత్‌కు బలమైన రక్షణ సంబంధాలు ఉన్నాయి. భారత్‌ వద్ద ఇప్పటికే రష్యా ఎస్‌-400 వ్యవస్థలు ఉన్నాయి. ఆధునిక ఎస్‌-500 క్షిపణి రక్షణ వ్యవస్థను, ఎస్‌యూ-57 ఐదోతరం ఫైటర్లను కూడా కొనుగోలు చేయడానికి మన దేశం ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో రఫేల్‌ ఫైటర్ల కొనుగోలు అంశంలో అమెరికా ఎలా వ్యవహరిస్తుందన్నది తేలాల్సి ఉంది.

Updated Date - Feb 09 , 2026 | 01:44 AM