పాలస్తీనా భవిష్యత్ తరాల నిర్మూలన!
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:03 AM
గాజాలో పాలస్తీనా చిన్నారుల మీద ఇజ్రాయెల్ జరిపిన దారుణాలకు సంబంధించిన దిగ్ర్భాంతికర అంశాలు వెల్లడయ్యాయి. పాలస్తీనీయులకు భవిష్యత్ తరం అనేదే ఉండకూడదనే దుర్మార్గమైన కుట్రతో ఇజ్రాయెల్ .....
దీనికోసమే గాజాలో పిల్లలపై ఇజ్రాయెల్ మారణకాండ.. రెండేళ్లలో 20,179 మంది చిన్నారుల మృతి
పిల్లలపై చిత్రహింసలు, అత్యాచారాలు
ఆస్పత్రులు, స్కూళ్ల విధ్వంసం
ఐరాస విచారణ కమిషన్ నివేదికలో దిగ్ర్భాంతికర అంశాలు
కమిషన్‌కు జస్టిస్ శ్రీనివాసన్ మురళీధర్ సారథ్యం
ఐరాస, జూన్ 25: గాజాలో పాలస్తీనా చిన్నారుల మీద ఇజ్రాయెల్ జరిపిన దారుణాలకు సంబంధించిన దిగ్ర్భాంతికర అంశాలు వెల్లడయ్యాయి. పాలస్తీనీయులకు భవిష్యత్ తరం అనేదే ఉండకూడదనే దుర్మార్గమైన కుట్రతో ఇజ్రాయెల్ వేల సంఖ్యలో పిల్లల్ని, పసికందుల ప్రాణాలు తీసినట్లు తెలిసింది. భారత్‌కు చెందిన జస్టిస్ శ్రీనివాసన్ మురళీధర్ సారథ్యంలో ఐక్యరాజ్యసమితి నియమించిన విచారణ కమిషన్.. తన 100 పేజీల నివేదికలో ఈ దారుణాలను పొందుపరిచింది. ఇజ్రాయెల్ మీద హమాస్ ఉగ్రవాదులు దాడి చేసిన 2023 అక్టోబరు 7వ తేదీ నుంచి 2025 అక్టోబరు 7వ తేదీ వరకూ గాజాలో ఇజ్రాయెల్ కొనసాగించిన దాడుల వివరాలను ఈ నివేదికలో పేర్కొన్నారు. దీంట్లో ఉన్న వివరాల ప్రకారం.. ఈ రెండేళ్లలో కనీసం 20,179 మంది పిల్లలు మరణించారు. 44,143 మంది పిల్లలు గాయపడ్డారు. ఇజ్రాయెల్ జరిపిన నరమేధం కారణంగా గాజాలో సంభవించిన మరణాల్లో పిల్లల మరణాలు ఏకంగా 30 శాతం ఉండటం గమనార్హం. 2025 అక్టోబరులో హమా్‌సకు ఇజ్రాయెల్‌కు మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా గాజాలో పిల్లల్ని కావాలని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ సైన్యం చంపుతూ వచ్చింది. పిల్లల మీద జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్ సైనికులు చిత్రహింసలను ఉపయోగించారు. అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు. లైంగిక దాడులు జరిపారు. పిల్లల ఉనికికి కీలకమైన ఆస్పత్రులు, విద్యాసంస్థలు, అనాథ గృహాలను సమూలంగా నేలమట్టం చేశారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం, విస్తృతస్థాయిలో జరిగిందనటానికి కచ్చితమైన రుజువులు తమ వద్ద ఉన్నాయని ఐరాస కమిషన్ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన చిన్నారుల్లో.. అప్పుడే పుట్టిన పసికందులు, ఏడాదిలోపు పిల్లలు కూడా ఉన్నారని తెలిపింది.
మానవతకే వ్యతిరేకమైన నేరాలివి
నివేదికపై జస్టిస్ మురళీధర్ మాట్లాడుతూ.. పాలస్తీనీయుల జనాభా వృద్ధి చెందకుండా, వారి స్వయం నిర్ణయాధికార హక్కును నిరాకరించాలనే ఉద్దేశంతోనే పిల్లల మీద ఇజ్రాయెల్ అధికారులు, సైన్యం కావాలని దాడులు చేసినట్లు సాక్ష్యాధారాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. పిల్లలను లక్ష్యంగా చేసుకోవటం ద్వారా పాలస్తీనా సమాజం పునాదినే ఇజ్రాయెల్ కూల్చివేస్తోందన్నారు. వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెలీ సెటిలర్ల హింసాకాండ కూడా ఇదే విధానానికి అనుగుణంగా పాలస్తీనీయుల భూభాగాలను ఆక్రమించుకోవటం లక్ష్యంగా నడుస్తోందన్నారు. ఇజ్రాయెల్ అధికారులు, భద్రతాసిబ్బంది జరుపుతున్న ఈ చర్యలు మానవతకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలని జస్టిస్ మురళీధర్ ఆభివర్ణించారు. గాజాలో సైనిక ఆపరేషన్లను ఇజ్రాయెల్ తక్షణం నిలిపివేయాలని ఐరాస నివేదిక పిలుపునిచ్చింది. అంతేకాదు, గాజా చిన్నారుల మీద జరిపిన దాడులకుగాను సంబంధిత అధికారులతోపాటు, మిలిటరీ, రాజకీయ నేతలను బాధ్యులుగా చేయాలని పేర్కొంది. గాజాలో ఈ నేరాలకు పాల్పడిన ఇజ్రాయెల్ సైనికులు, సైన్యాధికారులు, భద్రతా దళాల అధిపతులు, ఉన్నతాధికారుల మీద ప్రయాణ, ఆర్థిక ఆంక్షలు విధించాలని, వారి ఆస్తులను స్తంభింపచేయాలని, ఇజ్రాయెల్‌తో సైనిక పరమైన వాణిజ్యాన్ని సంపూర్ణంగా నిషేధించాలని.. ఈ మేరకు ఐరాస భద్రతామండలి చర్యలు తీసుకోవాలని ఈ నివేదిక సిఫారసు చేసింది. తమిళనాడుకు చెందిన జస్టిస్ మురళీధర్ ఢిల్లీ, పంజాబ్-హరియాణా హైకోర్టుల్లో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.