భద్రతామండలి యుద్ధాల్ని ఆపలేకపోతోంది
ABN , Publish Date - Mar 16 , 2026 | 03:35 AM
భద్రతామండలితో మనకు ఒక సమస్య ఉందనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ వ్యాఖ్యానించారు.
వీటో అధికారమే కారణం: ఐరాస చీఫ్ గుటెర్రెస్
ఐక్యరాజ్యసమితి, మార్చి 15: భద్రతామండలితో మనకు ఒక సమస్య ఉందనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ వ్యాఖ్యానించారు. బీరుట్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను భద్రతామండలి ప్రతిబింబించడంలేదన్నారు. శాశ్వత సభ్యదేశాల వీటో అధికారం వల్ల యుద్ధాలను భద్రతామండలి ఆపలేకపోతోందని చెప్పారు. ‘15 దేశాలు సభ్యులుగా ఉన్న భద్రతామండలిలో ఐరోపా నుంచి మూడు దేశాలకు, ఆసియా నుంచి ఒక దేశానికి, అలాగే అమెరికాకు శాశ్వత సభ్యత్వం ఉంది. ఆప్రికా, లాటిన్ అమెరికాల నుంచి శాశ్వత సభ్యదేశాలే లేవు. ప్రపంచ జనాభా, సంపదలో గణనీయమైన భాగం కలిగిన ఆసియా నుంచి శాశ్వత సభ్యదేశం ఒక్కటే ఉంది. అదే చైనా. వీటికి ఉన్న వీటో అధికారం వల్ల భద్రతామండలికి సమర్థత, చట్టబద్ధత సమస్య వస్తోంది. యుద్ధాలను ఆపాల్సిన అవసరం వస్తే, ఆపడానికి వీల్లేకుండా శాశ్వత సభ్యదేశాలు వీటో అధికారంతో అడ్డుపడుతున్నాయి. దీంతో భద్రతామండలి ఏమీ చేయలేకపోతోంది. ఇప్పట్లో ఈ పరిస్థితి మారుతుందనే ఆశాభావం నాకైతే లేదు’ అన్నారు.