మా కొంప ముంచుతున్న ఇరాన్ యుద్ధం
ABN , Publish Date - Apr 06 , 2026 | 03:52 AM
ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా నిండా మునిగి ఉండటంతో తమకు ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థల సరఫరా ఆలస్యం అవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ....
మాకు రావాల్సిన ఆయుధాలు ఇరాన్‌పైకి: జెలెన్‌స్కీ
ఇస్తాంబుల్, ఏప్రిల్ 5: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా నిండా మునిగి ఉండటంతో తమకు ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థల సరఫరా ఆలస్యం అవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తంచేశారు. ఇస్తాంబుల్‌లో అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ యుద్ధం ఎక్కువకాలం కొనసాగితే తాము రష్యాను నిలువరించటం కష్టమవుతుందని అన్నారు. అమెరికా నుంచి రావాల్సిన పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థల సరఫరా ఆలస్యమవుతోందన్నారు. దీనివల్ల తమ నగరాలపైకి రష్యా నుంచి నిత్యం వచ్చిపడుతున్న క్షిపణులు, డ్రోన్లను ఎదుర్కోవటం కష్టమవుతోందని చెప్పారు. ప్రస్తుతం అమెరికా దృష్టి మొత్తం ఇరాన్‌పైనే ఉందని, తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మధ్య ఆసియా యుద్ధం కారణంగా రష్యా చమురుపై అమెరికా ఆంక్షలను సడలించటంతో ఆ దేశానికి ఆదాయం కూడా పెరిగిందని, దీంతో తమపై మరింత తీవ్రంగా దాడులు చేస్తోందని తెలిపారు.