ఇరాన్‌కు.. రెండు టన్నుల బంగారం..
ABN , Publish Date - Aug 15 , 2026 | 05:27 AM
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్న తరుణంలో.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) తమ వద్ద ఫ్రీజ్ అయి ఉన్న రెండు టన్నుల బంగారాన్ని ఇరాన్‌కు వెనక్కు ఇచ్చింది.
డబ్బు, విమానాలు కూడా ఇచ్చిన యూఏఈ
న్యూఢిల్లీ, ఆగస్టు 14: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్న తరుణంలో.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) తమ వద్ద ఫ్రీజ్ అయి ఉన్న రెండు టన్నుల బంగారాన్ని ఇరాన్‌కు వెనక్కు ఇచ్చింది. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ అంటూనే దాడులు చేసుకుంటున్నాయి. తమపై అమెరికా బాంబులు కురిపించిన వెంటనే ఇరాన్ గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇకమీదట తాము ఇలా టార్గెట్ కాకూడదని యోచిస్తున్న యూఏఈ ఇరాన్‌ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా ఆంక్షల కారణంగా పలు దేశాల్లోని బ్యాంకుల వద్ద ఇరాన్ ఆస్తులు ఫ్రీజ్ అయి ఉన్నాయి. అలా తమ వద్ద ఉన్న ఇరాన్ నిధులను విడుదల చేసి, యుద్ధానికి దూరంగా ఉండాలని యూఏఈ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 11, 12 తేదీల్లో ఇరాన్‌కు విమానాల్లో డబ్బు తరలించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. రెండు టన్నుల బంగారం కూడా ఇచ్చినట్లు పేర్కొన్నాయి. అలాగే ఇరాన్ విమానయాన సంస్థలకు 15 సెకండ్‌హ్యాండ్ విమానాలను విక్రయించేందుకు యూఏఈ అంగీకరించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అవికాక మరో 14 ప్యాసింజర్ విమానాలను కూడా తిరిగి ఇవ్వనుందని వెల్లడించాయి.