యూఏఈ జైళ్ల నుంచి త్వరలో 900 మంది భారత ఖైదీల విడుదల
ABN , Publish Date - Jan 23 , 2026 | 03:55 AM
మానవతా దృక్పథంతో యూఏఈ పాలకులు తీసుకున్న నిర్ణయం మేరకు అక్కడి జైళ్ల నుంచి 900 మందికిపైగా భారత ఖైదీలు విడుదల కానున్నారు..
అబుదాబిలోని భారత ఎంబసీకి జాబితా
న్యూఢిల్లీ, జనవరి 22: మానవతా దృక్పథంతో యూఏఈ పాలకులు తీసుకున్న నిర్ణయం మేరకు అక్కడి జైళ్ల నుంచి 900 మందికిపైగా భారత ఖైదీలు విడుదల కానున్నారు. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయానికి వారి జాబితా అందింది. గతేడాది డిసెంబరు 2 జాతీయ దినోత్సవ (54వ ఈద్ అల్ ఇత్తిహాద్) వేడుకలకు ముందు దేశవ్యాప్తంగా వేలాది మంది ఖైదీలను విడుదల చేసేందుకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. మానవతా విలువల పట్ల యూఏఈ నిబద్ధతకు ఇది ప్రతిబింబంగా నిలుస్తుందని.. విడుదలయ్యే ఖైదీలకు కొత్త జీవితంతో పాటు వారి కుటుంబీకులకు ఉపశమనం దొరుకుతుందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. కాగా, భారత్-యూఏఈ మధ్య వివిధ రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ 35 లక్షల మంది భారతీయులున్నారు.