Prime Minister Modi: రెండు గంటల పర్యటనలో కీలక ఒప్పందాలు
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:18 AM
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధికారిక బృందం సోమవారం రెండు గంటల పాటు భారత్‌లో పర్యటించి కీలక ఒప్పందాలను కుదుర్చుకొంది.
భారత్ వచ్చిన యూఏఈ అధ్యక్షుడు
ప్రధాని మోదీతో పలు అంశాలపై విస్తృత చర్చలు
న్యూఢిల్లీ, జనవరి 19: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధికారిక బృందం సోమవారం రెండు గంటల పాటు భారత్‌లో పర్యటించి కీలక ఒప్పందాలను కుదుర్చుకొంది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ బృందంలో అబుదాబి, దుబాయ్ రాచకుటుంబాల సభ్యులు కూడా ఉన్నారు. యూఏఈ ఉప ప్రధాని, రక్షణ మంత్రిగా వ్యవహరిస్తున్న దుబాయ్ క్రౌన్‌ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ మౌక్తం కూడా ఈ బృందంలో ఉన్నారు. వీరంతా ప్రధాని మోదీతో విస్తృతంగా చర్చలు జరిపి ఉగ్రవాద నిర్మూలన, కృత్రిమ మేథ, రక్షణ రంగంలో సహకారం, వ్యూహాత్మక పెట్టుబడులు తదితర రంగాల్లో ఒప్పందాలను కుదుర్చుకొని పత్రాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రం మిస్రి వెల్లడించారు. భారత్-యూఏఈల మధ్య రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన సంకల్ప లేఖ(లెటర్ ఆఫ్ ఇంటెంట్)పై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. ఏటా 50 లక్షల టన్నుల వంతున దీర్ఘకాలం పాటు ద్రవీకృత సహజ వాయువు(ఎల్‌ఎన్‌జీ) సరఫరాపై ఒప్పందం కుదిరింది. గుజరాత్‌లోని ధేలారాలో ఉన్న స్పెషల్ ఇన్‌వె్‌స్టమెంట్ రీజియన్‌లో యూఈఏ పెట్టుబడులకు సంబంధించిన సంకల్ప లేఖపై కూడా సంతకాలు జరిగాయి. ఆహార భద్రత, వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది. భారత్‌లో డాటా సెంటర్, సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్, వినూత్నంగా ‘డాటా ఎంబసీ’ ఏర్పాటుపై చర్చలు జరిగాయి. సాంస్కృతిక రంగంలో సహకారంలో భాగంగా అబుదాబీలో ‘హౌస్ ఆఫ్ ఇండియా’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.