crime: బంగ్లాదేశ్‌లో హిందూ వితంతువుపై ఇద్దరి అత్యాచారం
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:57 AM
బంగ్లాదేశ్‌లో హిందూ మహిళలపై సైతం దాడులు జరుగుతున్నాయి. 40 ఏళ్ల వితంతువుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడడంతో పాటు....
చెట్టుకు కట్టేసి జుత్తు కత్తిరింపు
ఢాకా, జనవరి 5: బంగ్లాదేశ్‌లో హిందూ మహిళలపై సైతం దాడులు జరుగుతున్నాయి. 40 ఏళ్ల వితంతువుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడడంతో పాటు, ఆమెను చెట్టుకు కట్టేసి, జుత్తు కత్తిరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దారుణంగా హింసించడంతో పాటు, దాన్ని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. జెనాయిద్ జిల్లా కలియా గంజ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రకారం.. ఆమె రెండున్నరేళ్ల క్రితం షాహిన్, ఆయన సోదరుడి నుంచి నందిపారాలో మూడు సెంట్ల స్థలం, రెండంతస్తుల భవనాన్ని 20 లక్షల టాకాలకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి షాహిన్ ఆమెపై కన్నేసి అసభ్యకర ప్రతిపాదనలు చేస్తూ పలు రకాలుగా వేధించడం ప్రారంభించాడు. శనివారం సాయంత్రం ఆమె స్వగ్రామం నుంచి కొందరు బంధువులు వచ్చిన సమయంలో షాహిన్, అతడి స్నేహితుడు హస్సన్‌లు ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. ఆమెపై అత్యాచారం చేశారు. పైగా 50వేల టాకాలు (రూ.37,000) ఇవ్వాలని డిమాండు చేశారు. ఆ సమయంలో అత్యాచారం గురించి మాట్లాడలేకపోయిన ఆమె డబ్బు ఇవ్వడానికి మాత్రం నిరాకరించింది. కోపగించుకున్న నిందితులు ఇంట్లో ఉన్న ఆమె బంధువులను కొట్టి బయటకు తోసేశారు. కేకలు వేస్తూ రోదిస్తున్న ఆమెను బయటనున్న చెట్టుకు కట్టేసి, జుత్తును కత్తిరించారు. స్పృహ కోల్పోయేవరకు కొట్టారు. స్థానికులు గమనించి ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు.