Share News

హోర్ముజ్‌ను వదిలేసి..యుద్ధం ఆపేస్తే?

ABN , Publish Date - Apr 01 , 2026 | 03:58 AM

యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతుండటంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అసహనంతో ఉన్నారా? హోర్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు క్లిష్టమైన, భారీ స్థాయి దాడులు తప్పవని....

హోర్ముజ్‌ను వదిలేసి..యుద్ధం ఆపేస్తే?

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యోచన

  • ముందుగా అనుకున్నట్టుగా నాలుగైదు వారాల్లో పూర్తవని యుద్ధం

  • హోర్ముజ్‌ను తెరవడానికి క్లిష్టమైన,భారీ ఆపరేషన్‌ చేపట్టాల్సిన పరిస్థితి

  • అలా చేసినా సుదీర్ఘకాలం యుద్ధం చేయాల్సి వస్తుందనే అంచనాలు

  • జలసంధి బాధ్యతలు యూరప్‌, గల్ఫ్‌ దేశాలకు అప్పగించే యోచనలో ట్రంప్‌

  • వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సంచలన కథనం

వాషింగ్టన్‌/దుబాయ్‌/న్యూఢిల్లీ, మార్చి 31: యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతుండటంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అసహనంతో ఉన్నారా? హోర్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు క్లిష్టమైన, భారీ స్థాయి దాడులు తప్పవని, దానితో యుద్ధం సుదీర్ఘకాలం చేయాల్సి వస్తుందని భావిస్తున్నారా? ఈ క్రమంలో హోర్ముజ్‌ పరిస్థితిని అలాగే వదిలేసి, యుద్ధాన్ని నిలిపివేయాలని భావిస్తున్నారా?.. ప్రస్తుతం ట్రంప్‌ ఇదే ఆలోచనలో ఉన్నారని అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ట్రంప్‌ సహాయకులు, ఉన్నతాధికారులను ఉటంకిస్తూ, కొన్ని రోజులుగా ట్రంప్‌ చేస్తు న్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఈ మేరకు కథనం ప్ర చురించింది. ఆ కథనం ప్రకారం.. ఇరాన్‌పై యుద్ధం నాలుగు నుంచి ఆరు వారాల్లో ముగుస్తుందని ట్రంప్‌ భావించారు. యుద్ధం మొదలై నాలుగు వారాలు దాటింది. ఇప్పట్లో ముగిసే పరిస్థితి కనబడటం లేదు. హోర్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు ప్రయత్నిస్తే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. మరింత కాలం యుద్ధాన్ని కొనసాగించక తప్పని పరిస్థితి నెలకొంటుంది. దానికితోడు హోర్ముజ్‌ను తె రిచేందుకు బలగాలతో సాయంగా రావాలని ట్రంప్‌ ఎన్నిసార్లు కోరినా నాటో దేశాల నుంచి సానుకూల స్పందన రావడం లేదు. దీనిపై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. హోర్ముజ్‌ జలసంధి మూసి ఉండటం వల్ల అమెరికాకు నేరుగా జరిగే నష్టమేమీ లేదని భావిస్తున్నారు. ఇరాన్‌ నౌకాదళాన్ని, రక్షణ వ్యవస్థలను, క్షిపణి తయారీ, అణుశుద్ధి సామర్థ్యాలను పూర్తిగా దెబ్బతీయడం తదితర అమెరికా ప్రధాన లక్ష్యాలను పూర్తిచేసి.. యుద్ధం నుంచి వైదొలగాలన్నదే తొలి నుంచీ తన ఆలోచన అని ట్రంప్‌ తన సహాయకులు, సలహాదారులతో పేర్కొన్నట్టుగా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. ఈ క్రమంలో హో ర్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు భారీ ప్రయత్నాలేవీ చేయకుండా, అలాగే వదిలేసి.. యుద్ధాన్ని ముగించాలని భావిస్తున్నట్టు ట్రంప్‌ పేర్కొన్నారని తెలిపింది. తర్వాత హోర్ముజ్‌ నుంచి వాణిజ్యాన్ని పునరుద్ధరించే దిశగా ఇరాన్‌పై దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావాలని.. జలసంధి బాధ్యతలను యూరప్‌, గల్ఫ్‌లోని మిత్రదేశాలకు అప్పగించాలని ట్రంప్‌ భావిస్తున్నారని వెల్లడించింది. ఇరాన్‌ మిలిటరీ, దాడి సామర్థ్యాలను దెబ్బతీయాలన్న అమెరికా లక్ష్యం కొన్ని వారాల్లోనే పూర్తవుతుందని.. తర్వాత హోర్ముజ్‌ను పూర్తిగా తెరవడమా?, పలుదేశాల కూటమి ఆధ్వర్యంలో నౌకా రవాణా స్వేచ్ఛగా జరిగేలా చూడటమా అన్నదానిని ఇరాన్‌కు వదిలేస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తాజాగా పేర్కొనడం గమనార్హం.


ట్రంప్‌కు ఇటలీ షాక్‌..

ఇరాన్‌పై దాడులకు సహకరించే అంశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇటలీ కూడా షాకిచ్చింది. ఇరాన్‌పై యుద్ధం కోసం తమ దేశంలోని సిసిలీ ఎయిర్‌బే్‌సను వినియోగించుకోవడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. స్పెయిన్‌ సోమవారమే ఇలాంటి ప్రకటన చేసింది. ఫ్రాన్స్‌ మొదటి నుంచీ తమ ఎయిర్‌బే్‌సలను ఇరాన్‌పై దాడికి, మిలిటరీ సామగ్రిని తరలించడానికి అనుమతించడం లేదు. ఇవన్నీ నాటో దేశాలే కావడం గమనార్హం.

Updated Date - Apr 01 , 2026 | 03:58 AM