Share News

నా అనుమతి లేకుండా ఎన్నుకుంటే..ఎక్కువ రోజులు ఉండరు!

ABN , Publish Date - Mar 09 , 2026 | 04:43 AM

తన అనుమతి లేకుండా ఇరాన్‌ నాయకులు దేశానికి కొత్త నేతను ఎన్నుకుంటే.. ఆ నేత ఎక్కువ రోజులు ఉండబోరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. మరణించిన సుప్రీంలీడర్‌ అయతుల్లా ఖమేనీ......

నా అనుమతి లేకుండా ఎన్నుకుంటే..ఎక్కువ రోజులు ఉండరు!

  • నా అనుమతి లేకుండా ఎన్నుకుంటే..ఎక్కువ రోజులు ఉండరు!

  • ఇరాన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ నేత అలీ లారిజానీ ఎవరో తెలియదు.. పట్టించుకునే అవసరం లేదు

  • వాళ్లు బేషరతుగా లొంగిపోవాల్సిందే..

  • ఇరాన్‌ నాయకత్వానికి ట్రంప్‌ హెచ్చరిక

  • గెలిచాక యుద్ధంలో చేరేవాళ్లు అవసరం లేదంటూ యూకే ప్రధాని స్టార్మర్‌కు చురక

వాషింగ్టన్‌, మార్చి 8: తన అనుమతి లేకుండా ఇరాన్‌ నాయకులు దేశానికి కొత్త నేతను ఎన్నుకుంటే.. ఆ నేత ఎక్కువ రోజులు ఉండబోరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. మరణించిన సుప్రీంలీడర్‌ అయతుల్లా ఖమేనీ స్థానంలో కొత్త నేత ఎన్నుకునే ప్రక్రియను ఇరాన్‌ రెలీజియస్‌ కౌన్సిల్‌ ఓ కొలిక్కి తెచ్చిందనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ట్రంప్‌ను వదిలిపెట్టేదే లేదని, తగిన మూల్యం చెల్లించుకుంటారని ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సెక్రెటరీ అలీ లారిజానీ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. ‘‘అతనెవరో నాకు తెలియదు. అతనేం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. వాటిని ఏ మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వారు ఇప్పటికే ఓడిపోయారు. ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతాయి. వాళ్లు బేషరతుగా లొంగిపోవాల్సిందే’’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు.

గెలిచాక యుద్ధంలో చేరేవాళ్లు అవసరం లేదు..

తమ విమాన వాహక యుద్ధ నౌకలను పశ్చిమాసియాకు సమీపంగా మోహరించనున్నామని యూకే రక్షణ శాఖ ప్రకటించడాన్ని ట్రంప్‌ తప్పుబట్టారు. ‘‘యూకే ఒకప్పుడు మాకు అత్యంత మిత్రదేశం. పశ్చిమాసియాకు రెండు యుద్ధనౌకలను పంపించేందుకు సిద్ధమైంది. అది సరే యూకే ప్రధాని స్టార్మర్‌.. ఇప్పుడు మాకు వాటి అవసరం లేదు. ఈ విషయాన్ని మేం గుర్తుపెట్టుకుంటాం. అప్పటికే విజయం సాధించిన తర్వాత యుద్ధంలో చేరేవాళ్లు మాకు అవసరం లేదు..’’ అని ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు. కాగా, ఆదివారం ఉదయం ట్రంప్‌కు బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ ఫోన్‌ చేసి చర్చించారు. పశ్చిమాసియాలో యూకే స్థావరాలను అమెరికా వినియోగించుకోవడంతోపాటు మిత్రదేశాలకు స్వీయ రక్షణ విషయంలో అందించాల్సిన సాయంపై వారు చర్చించినట్టు యూకే ప్రధాని కార్యాలయం ప్రకటన జారీ చేసింది.

ఎన్నుకునేది ట్రంప్‌ కాదు.. మా ప్రజలు: అబ్బాస్‌ అరాగ్చి

తన అనుమతి లేకుండా ఎన్నుకునే ఇరాన్‌ నేత ఎక్కువ రోజులు ఉండరన్న ట్రంప్‌ వ్యాఖ్యలను ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చి తప్పుబట్టారు. ఎన్‌బీసీ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘‘మా అంతర్గత వ్యవహారాల్లో ఎవరి జోక్యాన్ని మేం అంగీకరించబోం. కొత్త నేతను ఎన్నుకునేది అమెరికా అధ్యక్షుడు కాదు.. ఇరాన్‌ ప్రజలు. మా నిపుణుల బృందం సమావేశమై కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకుంటుంది’’ అని అరాగ్చి పేర్కొన్నారు. ఇరాన్‌పై ఏకపక్షంగా దాడికి దిగినందుకు ట్రంప్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 09 , 2026 | 04:43 AM