Share News

తేడా వస్తే.. దాడి తప్పదు

ABN , Publish Date - May 04 , 2026 | 03:38 AM

ఇరాన్‌తో యుద్ధం, శాంతి ఒప్పందం విషయాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘బెదిరించి దారికి తెచ్చుకొనే’ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.

తేడా వస్తే.. దాడి తప్పదు

  • ఇరాన్‌ తప్పుగా వ్యవహరిస్తే మళ్లీ దాడులు: ట్రంప్‌

వాషింగ్టన్‌/ టెహ్రాన్‌, మే 3: ఇరాన్‌తో యుద్ధం, శాంతి ఒప్పందం విషయాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘బెదిరించి దారికి తెచ్చుకొనే’ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతూనే.. ఆ దేశం తప్పుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులు తప్పవని హెచ్చరించారు. ఫ్లోరిడాల్లో వెస్ట్‌ పామ్‌ బీచ్‌ నుంచి శనివారం (స్థానిక కాలమానం) మియామీ వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘శాంతి ఒప్పంద ప్రణాళికగురించి వాళ్లు (ఇరాన్‌) నాకు చెప్పారు. త్వరలో కచ్చితమైన ప్రతిపాదన చేయబోతున్నారు’ అని తెలిపారు. ఇరాన్‌పై మళ్లీ దాడులు మొదలుపెట్టే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఆ విషయాన్ని నేను ఒక మీడియా ప్రతినిధితో చెప్పలేను. ఒకవేళ వాళ్లు తప్పుగా ప్రవర్తిస్తే, ఏమైనా చెడు చేస్తే.. దాడులు తప్పకపోవచ్చు’ అని అన్నారు. అనంతరం సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.. ఇరాన్‌ ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా ఉంటాయని అనుకోవటం లేదని ట్రంప్‌ పేర్కొన్నారు.

14 అంశాలతో ఇరాన్‌ కొత్త శాంతి ప్రణాళిక ప్రతిపాదన

యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్‌ 9 షరతులతో ఓ ప్రతిపాదన చేయగా.. ప్రతిగా ఇరాన్‌ 14 అంశాలతో కొత్త శాంతి ప్రణాళికను ప్రతిపాదించింది. దీనిని పాకిస్థాన్‌ ద్వారా అమెరికాకు అందజేసింది. ‘లెబనాన్‌పై దాడులు సహా యుద్ధాన్ని వెంటనే ఆపేయాలి. మాపై ఆంక్షలను పూర్తిగా ఎత్తేయాలి. యుద్ధం వల్ల మాకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి. హోర్ముజ్‌ జలసంధిలో అమెరికా నౌకాదళం దిగ్బంధనాన్ని తొలగించాలి. అమెరికా బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. విదేశాల్లో ఉన్న ఇరాన్‌ ఆస్తులను జప్తు నుంచి విడిపించాలి. హోర్ముజ్‌ జలసంధి నిర్వహణకు కొత్త వ్యవస్థను ఏర్పాటుచేయాలి’ అని డిమాండ్‌ చేసింది. ఈ ప్రతిపాదనలు పంపిన తర్వాత ఇరాన్‌ డిప్యూటీ విదేశాంగ మంత్రి కజమ్‌ ఘరిబబాది మీడియాతో మాట్లాడుతూ.. తాము శాంతికైనా, యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది అమెరికాయేనని పేర్కొన్నారు.

Updated Date - May 04 , 2026 | 03:38 AM