ఇరాన్‌ను భూమ్మీదే లేకుండా పేల్చేస్తా!
ABN , Publish Date - May 06 , 2026 | 07:44 AM
పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకున్న వాణిజ్య నౌకలను తమ యుద్ధ నౌకల రక్షణ మధ్య హోర్ముజ్ జలసంధి దాటిస్తామని.. ఇందుకోసం ‘ప్రాజెక్టు ఫ్రీడమ్’ చేపట్టామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్...
వాణిజ్య నౌకలను హోర్ముజ్ దాటించేందుకు ‘ప్రాజెక్టు ఫ్రీడమ్’
ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్/దుబాయ్/న్యూఢిల్లీ, మే 5: పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకున్న వాణిజ్య నౌకలను తమ యుద్ధ నౌకల రక్షణ మధ్య హోర్ముజ్ జలసంధి దాటిస్తామని.. ఇందుకోసం ‘ప్రాజెక్టు ఫ్రీడమ్’ చేపట్టామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. హోర్ముజ్ జలసంధిలో తమ నౌకలపై గనుక దాడి చేస్తే.. ఇరాన్‌ను భూమ్మీదే లేకుండా పేల్చేస్తానని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండటానికి వీల్లేదని పేర్కొన్నారు. శ్వేతసౌధంలో జరిగిన ఓ కార్యక్రమంలో, ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమన్ వరకు అమెరికా మిలిటరీ ఆధిపత్యమే కొనసాగుతోందని.. ఇరాన్ వైమానిక, నావికా దళాలను, రాడార్లు, ఇతర వ్యవస్థలన్నీ నాశనం చేశామని చెప్పారు. ప్రస్తుతం ఇరాన్ నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోందన్నారు. అమెరికా ఇంతకు ముందు వినియోగించని శక్తివంతమైన, వ్యూహాత్మక ఆయుధాలను సన్నద్ధంగా ఉంచిందని, అవసరమైతే వాటిని వినియోగిస్తామని పేర్కొన్నారు. చర్చల విషయంలో ఇరాన్ కాస్త దిగివచ్చిందని, కానీ అది సరిపోదని వ్యాఖ్యానించారు. హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న తమ నౌకల వైపు వచ్చిన ఆరు ఇరాన్ బోట్లను పేల్చివేశామని ట్రంప్ చెప్పారు.
ప్రాంతీయ భద్రతకు విఘాతం: ఘలీబఫ్
కాల్పుల విరమణను ఉల్లంఘించేలా అమెరికా వ్యవహరిస్తున్న తీరు పశ్చిమాసియాలో ప్రాంతీయ భద్రతను ప్రమాదంలో పడేస్తుందని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఘలీబఫ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం కొత్త సమీకరణాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణను తప్పించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలపై తాము ఇంకా పూర్తిస్థాయిలో ప్రతిస్పందించ లేదన్నారు. కాగా, ఆరు ఇరాన్ బోట్లను ముంచేశామన్న అమెరికా ప్రకటనను ఇరాన్ సైన్యం ఖండించింది. రెండు ఇరాన్ సరుకు రవాణా బోట్లపై దాడి జరిగిందని, ఐదుగురు పౌరులు మరణించారని పేర్కొంది.
అమెరికా ట్యాంకర్ విమానం అదృశ్యం!
అమెరికా సైన్యానికి చెందిన కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్ విమానం మంగళవారం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అదృశ్యమైంది. యూఏఈలోని అల్ ధాఫ్రా ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన ఈ విమానం ఖతార్ గగనతలానికి సమీపంలో ప్రయాణిస్తుండగా ‘7700’ అంటూ అత్యవసర ప్రమాద సంకేతాన్ని పంపింది. ఫ్లైట్‌రాడార్24 వెబ్‌సైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం గల్లంతవడానికి ముందు ఈ కేసీ-135 విమానం పర్షియన్ గల్ఫ్‌లోనే పలుమార్లు చక్కర్లు కొట్టింది. ల్యాండ్ అయ్యేందుకు ఖతార్‌వైపు మళ్లింది. కాసేపటికే రాడార్ల నుంచి అదృశ్యమైంది. యూఏఈ వైపు ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో ఏదైనా తగిలిందా? మరేదైనా సాంకేతిక కారణంతో కూలిపోయిందా అన్న దానిపై స్పష్టత రాలేదు. అమెరికా యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనాన్ని నింపేందుకు, అత్యవసర పరిస్థితుల్లో రవాణా కోసం బోయింగ్ కేసీ-135 విమానాలను ఉపయోగిస్తారు.
యూఏఈపై దాడులు సరికాదు: మోదీ
యూఏఈపై క్షిపణి, డ్రోన్ దాడులను ప్రధాని మోదీ ఖండించారు. ఇలా పౌర, మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకోవడం ఏమాత్రం అంగీకారయోగ్యం కాదని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిలో భద్రమైన, ఎలాంటి అంతరాయం లేని నౌకా రవాణా అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు. ‘ప్రాజెక్టు ఫ్రీడమ్’ పేరిట హోర్ముజ్‌ను తెరిచేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇరాన్ ప్రతిచర్యలకు దిగిన సంగతి తెలిసిందే. యూఏఈలోని ఫుజైరా చమురు క్షేత్రంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించగా.. అక్కడ పనిచేస్తున్న ముగ్గురు భారతీయ సిబ్బంది గాయపడ్డారు.
సముద్రంలో చిక్కిన..
భారత నావికులకు పాక్ సాయం!
నౌకలో సాంకేతిక సమస్య తలెత్తి సముద్రంలో చిక్కుకున్న భారత నౌకలోని సిబ్బందికి పాకిస్థాన్ నౌకాదళం సాయం అందించింది. దీనిపై పాక్‌కు చెందిన డాన్ పత్రిక కథనం ప్రచురించింది. ఒమన్ నుంచి భారత్‌కు వస్తున్న ఎంవీ గౌతమ్ నౌక పాక్‌కు సమీపంలో అరేబియా సముద్రంలో సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. అందులో ఆరుగురు భారతీయులు, ఒక ఇండోనేషియన్ ఉన్నారు. దీనిపై ముంబైలోని భారత మ్యారీటైమ్ రెస్క్యూ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు పాక్ మ్యారీటైమ్ సెక్యూరిటీ ఫోర్స్ స్పందించి.. ఎంవీ గౌతమ్ నౌకలోని సిబ్బందికి ఆహారం, మందులు, ఇతర సహాయాన్ని అందించినట్టు డాన్ పత్రిక పేర్కొంది.