ఇప్పటికైనా ఆపితే సరి..లేకుంటే ఇరాన్ వినాశనమే
ABN , Publish Date - Mar 02 , 2026 | 02:20 AM
ఖమేనీ మృతి విషయాన్ని ట్రంప్ తొలుత ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. ‘‘చరిత్రలో అత్యంత దుష్టులైనవారిలో ఒకరైన ఖమేనీ మరణించారు.
వాషింగ్టన్, మార్చి 1: ఖమేనీ మృతి విషయాన్ని ట్రంప్ తొలుత ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. ‘‘చరిత్రలో అత్యంత దుష్టులైనవారిలో ఒకరైన ఖమేనీ మరణించారు. ఇది కేవలం ఇరాన్ ప్రజలకే కాదు.. ఖమేనీ, దోపిడీదారులైన ఆయన గ్యాంగ్ పాల్పడిన దారుణాల్లో ప్రాణాలు కోల్పోయిన, బాధితులైన అమెరికన్లు, ఇతర దేశాల వారికి జరిగిన న్యాయం.. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి తమ చేతుల్లోకి తెచ్చుకోవడానికి ఇది ఏకైక గొప్ప అవకాశం. ఇరాన్‌లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో వారం పాటు వరుసగా భారీ స్థాయిలో బాంబు దాడులు కొనసాగుతాయి. పశ్చిమాసియాలో, తద్వారా ప్రపంచంలో శాంతి నెలకొల్పాలన్న మా లక్ష్యం నెరవేరేదాకా దాడులు ఉంటాయి..’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా స్థావరాలపై ఎన్నడూ లేని స్థాయిలో దాడి చేస్తామని ఇరాన్‌లో మిగిలినవారు అంటున్నారని.. వారు అలా చేయకపోవడం మంచిదని చెప్పారు. లేకపోతే ఇరాన్ ఇంతకుముందెన్నడూ చూడని స్థాయిలో వినాశనాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం సీఎన్‌బీసీకి, ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ట్రంప్ మరికొన్ని వివరాలు వెల్లడించారు. ఒకే ఒక్క దెబ్బతో ఇరాన్‌కు చెందిన 48 మంది అగ్రనేతలు, కీలక అధికారులను చంపేశామని పేర్కొన్నారు. 9 ఇరాన్ యుద్ధ నౌకలను ధ్వంసం చేశామన్నారు. కాగా, ఖమేనీ మృతి అనంతరం పాలన పగ్గాలు చేపట్టిన కొత్త నేతలు చర్చల కోసం తనను సంప్రదించారని ట్రంప్ చెప్పారు. నిజానికి ఇరాన్ నాయకత్వం ఈ పని ముందే చేసి ఉండాల్సిందని ట్రంప్ అన్నారు.