అలా చేస్తే ఇరాన్..భూమ్మీదే లేకుండా పోతుంది
ABN , Publish Date - Jan 22 , 2026 | 03:20 AM
తన జోలికి వస్తే, తనకేమైనా అయితే ఇరాన్ భూమ్మీదే లేకుండా పోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. వారేమైనా చేస్తారో లేదోగానీ తాను ఏం చేస్తాననేది మాత్రం చెబుతున్నానని పేర్కొన్నారు.
తన జోలికి వస్తే ఆ దేశమే ఉండదని ట్రంప్ హెచ్చరిక
ఖమేనీ పాలన త్వరలోనే అంతమవుతుందని వ్యాఖ్య
వాషింగ్టన్/న్యూఢిల్లీ, జనవరి 21: తన జోలికి వస్తే, తనకేమైనా అయితే ఇరాన్ భూమ్మీదే లేకుండా పోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. వారేమైనా చేస్తారో లేదోగానీ తాను ఏం చేస్తాననేది మాత్రం చెబుతున్నానని పేర్కొన్నారు. ఇరాన్ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో ఖమేనీ ప్రభుత్వం దిగిపోవాలంటూ ఆ దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అవి హింసాత్మకంగా మారి వేలాది మంది మరణించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు చంపితే.. ఇరాన్‌పై దాడి చేస్తామని కొన్ని రోజుల క్రితం ట్రంప్ హెచ్చరించారు. తాజాగా త్వరలోనే ఇరాన్‌లో ఖమేనీ పాలన అంతమవుతుందని పేర్కొన్నారు. అయితే అమెరికా ఖమేనీకి వ్యతిరేకం గా ఎలాంటి చర్యలు చేపట్టినా.. ఆ ఒక్క చేతినే కాదు, మొత్తం ప్రపంచాన్నే తగలబెడతామని, ట్రంప్‌ను చంపేస్తామని ఇరాన్ సైన్యం అధికార ప్రతినిధి అబోల్ ఫజల్ షెకార్చి వ్యాఖ్యానించారు. దానికితోడు ఇరాన్‌పై దాడికి దిగితే.. తమవద్ద ఉన్న అన్ని రకాల ఆయుధాలతో ప్రతిదాడికి దిగుతామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి బుధవారం దావోస్ సదస్సు వేదికగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు.
పశ్చిమాసియా వైపు అమెరికా సేనలు
సుమారు వారం రోజుల క్రితమే ఇరాన్‌పై దాడికి ట్రంప్ సిద్ధమయ్యారని.. ఇజ్రాయెల్, అరబ్ దేశాల విజ్ఞప్తితో వాయిదా వేశారని వార్తలు వచ్చాయి. దానితో ఇప్పట్లో దాడి చేయకపోవచ్చని భావించారు. కానీ అమెరికా తన సేనలను పశ్చిమాసియా వైపు తరలిస్తోంది. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను ఎత్తుకెళ్లడానికి ముందు కరీబియన్ ప్రాం తంలో మోహరించిన విమాన వాహక నౌకలు, ఆగ్నేయాసియా ప్రాంతంలోని సైనిక స్థావరాల నుంచి పేట్రియాట్, థాడ్ క్షిపణి వ్యవస్థలను పశ్చిమాసియాకు తరలించి, కీలక ప్రాంతాల్లో మోహరిస్తోందని రక్షణ పరిశోధన వెబ్‌సైట్లు వెల్లడించాయి.
ఒక్కో యుద్ధానికి ఒక నోబెల్ ఇవ్వాలి: ట్రంప్
తాను ఎన్నో యుద్ధాలు ఆపానని, నిజానికి తనకు ఒక్కో యుద్ధానికి సంబంధించి ఒక్కో నోబెల్ ఇవ్వాల్సిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం వ్యాఖ్యానించారు. తనకు ఆ బహుమతి అందకపోయినా.. తాను లక్షలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడానని చెప్పారు. నోబెల్ శాంతి బహుమతిపై ఆశలు పెట్టుకున్న ట్రంప్.. తనకు ప్రకటించకపోవడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. నార్వే ప్రధాని కావాలనే తనకు నోబెల్ ఇవ్వకుండా అడ్డుపడ్డారని కూడా ట్రంప్ ఇటీవల ఆరోపించారు. కానీ నోబెల్ బహుమతులకు ఎంపికలను నోబెల్ కమిటీయే చూసుకుంటుందని, నార్వే ప్రధాని జోనాస్ గహెర్ ప్రకటించారు.