సుప్రీంకోర్టు తీర్పు ఆసరాగా ఆటలాడాలని చూస్తే భారీగా సుంకాలు వేస్తా!
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:24 AM
అదనపు సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సుప్రీం కోర్టు తీర్పును అలుసుగా తీసుకుని ఏ దేశమైనా తమతో ఆటలాడాలని చూస్తే భారీగా సుంకాలు విధిస్తానని హెచ్చరించారు....
ప్రపంచ దేశాలకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్, ఫిబ్రవరి 23: అదనపు సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సుప్రీం కోర్టు తీర్పును అలుసుగా తీసుకుని ఏ దేశమైనా తమతో ఆటలాడాలని చూస్తే భారీగా సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. తీర్పు విషయంలో సుప్రీం కోర్టును మరోసారి లక్ష్యంగా చేసుకొని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానం తెలియకుండానే తన ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టిందన్నారు. టారి్‌ఫలపై కోర్టు తీర్పు ‘అసమర్థంగా, హాస్యాస్పదం’గా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ట్రంప్ వరుస పోస్టులు పెట్టారు. ‘‘సుప్రీంకోర్టు తెలిసో తెలియకో ఇచ్చిన అసమర్థ, హాస్యాస్పద, మూర్ఖపు, అంతర్జాతీయంగా విభేదాలు తెచ్చేలా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుతో అమెరికా అధ్యక్షుడిగా నాకు గతంలో లేనన్ని అధికారాలు ఇచ్చింది. మరింత శక్తిమంతం చేసింది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పును అలుసుగా తీసుకొని ఆటలాడాలని చూసే దేశాలపై ఎన్నడూలేని రీతిలో సుంకాలు విధిస్తా. అమెరికాను దశాబ్దాలుగా కొల్లగొట్టిన దేశాలు.. ఇటీవల అంగీకరించిన దానికంటే భారీ సుంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సుంకాల ఆమోదం పొందడానికి అధ్యక్షుడిగా నేను కాంగ్రె్‌సకు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు’’ అంటూ ట్రంప్ హెచ్చరించారు. ‘‘అనేక ఏళ్లుగా అమెరికాను కొల్లగొట్టిన దేశాలపై ఇప్పుడు లైసెన్స్‌ల రూపంలో కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఈ లైసెన్స్‌లకు ఫీజు వసూలు చేయడం కుదరదని తీర్పు చెబుతోంది. వాస్తవానికి ప్రతి లైసెన్స్‌కు ఒక ఫీజు ఉంటుంది. మరి మేం ఎందుకు వసూలు చేయకూడదు? అదేవిధంగా కోర్టు ఇతర సుంకాలను ఆమోదించింది. ఇప్పుడు వాటిని చట్టబద్ధంగా, కఠినంగా ఉపయోగించగలను. ఏదేమైనా కోర్టు తప్పుడు వ్యక్తులకు సాయం చేసింది. మున్ముందు ‘జన్మతః పౌరసత్వం’ విషయంలోనూ వ్యతిరేక తీర్పు ఇవ్వొచ్చేమో? ఇలాంటి తీర్పులు చైనా, ఇతర దేశాలకే ప్రయోజనాలు చేకూరుస్తాయి’’ అని మండిపడ్డారు. అలాగే తీర్పును వ్యతిరేకించిన ముగ్గురు జడ్జిలను గొప్పవారిగా ట్రంప్ అభివర్ణించారు.
నేటి నుంచి ఆ సుంకాలు బంద్!
ట్రంప్ వేసిన దిగుమతి సుంకాల వసూలును మంగళవారం (ఈ నెల 24) నుంచి నిలిపివేయనున్నారు. ఆ సుంకాలు రాజ్యాంగ విరుద్ధమంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ట్రంప్ భారీగా వేసిన అదనపు సుంకాల వసూలును నిలిపివేయనున్నట్లు ఆ దేశ కస్టమ్స్ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ఐఈఈపీఏ కింద విధించిన అదనపు సుంకాల వసూళ్లను నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. అమెరికా దిగుమతి చేసుకునే భారతీయ ఉత్పత్తులపై ప్రస్తుతం 25ు సుంకాలు ఉండగా.. మంగళవారం నుంచి అవి 10 శాతానికి తగ్గనున్నాయి. భారత దిగుమతులపై 150రోజుల పాటు 10ు సుంకాలను వసూలు చేస్తారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్ని దేశాలపై 15 శాతం సుంకాలు వసూలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, దానిపై అధికారిక ప్రకటన రాలేదు. ‘‘ప్రస్తుతం ఉన్న ఆదేశాల ప్రకారం భారత ఉత్పత్తులపై అమెరికా ఈ నెల 24 నుంచి 10 శాతం సుంకాలు వసూలు చేస్తుంది. 15 శాతంపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటనేదీ లేదు’’ అని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య తెలిపింది.