ట్రంప్ సర్కార్‌కు ఎదురుదెబ్బ
ABN , Publish Date - Sep 16 , 2026 | 05:57 AM
అమెరికా వీసాల విధానంలో కొత్త పాలసీ తెచ్చిన డొనాల్డ్ ట్రంప్ సర్కార్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులు, ఎక్చ్సేంజ్ విజిటర్ల వీసాల కాలపరిమితిని తగ్గించే నిబంధనను..
విదేశీ విద్యార్థులు, జర్నలిస్టు వీసాల కాలపరిమితి ఆంక్షలపై అమెరికా ఫెడరల్ కోర్టు స్టే
భారతీయ విద్యార్థులకు ఊరట
గ్రీన్‌కార్డు నిరాకరణ నిబంధనపై 23 రాష్ట్రాల దావా
వాషింగ్టన్, సెప్టెంబరు 15: అమెరికా వీసాల విధానంలో కొత్త పాలసీ తెచ్చిన డొనాల్డ్ ట్రంప్ సర్కార్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులు, ఎక్చ్సేంజ్ విజిటర్ల వీసాల కాలపరిమితిని తగ్గించే నిబంధనను ఫెడరల్ కోర్టు జడ్జి తాత్కాలికంగా నిలిపివేశారు. కొత్త నిబంధన మంగళవారం నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, ఒక్కరోజు ముందు సోమవారం మసాచుసెట్స్ డిస్ర్టిక్ట్ జడ్జి ఎఫ్ డెన్నిస్ సేలర్ దానిపై స్టే విధించారు. కొత్త పాలసీ అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ఉన్నత విద్యా వ్యవస్థకు తీవ్ర నష్టం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశాన్ని రక్షించడానికే ఈ కొత్త పాలసీ తెచ్చామన్న ప్రభుత్వ వాదనను జడ్జి తిప్పికొట్టారు. కోర్టు తీర్పుతో అంతర్జాతీయ విద్యార్థులు, ముఖ్యంగా భారతీయులకు పెద్ద ఊరట నిచ్చినట్లు అయింది. విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్ వీసాల కాలపరిమితిని నాలుగేళ్లకు, జర్నలిస్టుల వీసాలకు 240 రోజులకు కుదిస్తూ, చైనా జర్నలిస్టులకు 90 రోజుల అనుమతి మాత్రమే ఇస్తూ ట్రంప్ సర్కార్ జూలైలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కాలపరిమితి పొడగింపు కోసం విద్యార్థులు, జర్నలిస్టులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. ఆ పొడిగింపుపై నిర్ణయం డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ (డీహెచ్‌ఎస్) విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ డీహెచ్‌ఎస్ నిరాకరిస్తే దానిపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదు. అయితే విద్యార్థులు తమ చదువు పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండే అవకాశాన్ని పాత నిబంధన కల్పిస్తుంది. దీనికి చెల్లుచీటీ పాడాలని ట్రంప్ సర్కార్ భావించగా, కొత్త నిబంధన నిలిపివేయాలంటూ పలు ఉన్నత విద్యాసంస్థలు, కార్మిక సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు తీర్పు కేవలం ఫిర్యాదుదారులకే పరిమితం చేయాలని, అది దేశం మొత్తానికి అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వద్దని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఫిర్యాదుదారులు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు 600 ఉండగా, దేశంలో 5 వేలకు పైగా ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయని జడ్జి పేర్కొన్నారు. ప్రాతినిధ్య పక్షాలకు మాత్రమే ఉపశమనం కలిగించాలంటే సమాంతర నియంత్రణ వ్యవస్థలు తీసుకురావడంతో పాటు పదేపదే పరస్పర విరుద్ధ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని జడ్జి అన్నారు.
పబ్లిక్ చార్జ్‌పై 23 రాష్ట్రాల దావా
కోర్టుల్లో ఎదురుదెబ్బలతో పాటు రాష్ట్రాల నుంచి కూడా ట్రంప్ సర్కార్ ఇమ్మిగ్రేషన్ నిర్ణయాలపై వ్యతిరేకత వస్తోంది. అమెరికా ప్రభుత్వ ప్రయోజనాలను (పబ్లిక్ చార్జ్) ఉపయోగించుకునే విదేశీయులకు గ్రీన్‌కార్డును నిరాకరించాలనే నిబంధనను వ్యతిరేకిస్తూ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాతో సహా 23 రాష్ట్రాలు, ఆరు నగరాలు, కౌంటీలు ఉమ్మడిగా కోర్టులో దావావేశాయి. ట్రంప్ సర్కారు తీసుకొస్తున్న ఈ వివాదాస్పద పాలసీ శుక్రవారం నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, దానిని అడ్డుకుని, రద్దు చేయాలని కోరుతూ మన్‌హటన్ ఫెడరల్ కోర్టులో రెండు ఫిర్యాదులు దాఖలయ్యాయి. ప్రజలకు అందించే ఫుడ్ స్టాంప్స్, మెడికెయిడ్ వంటి సంక్షేమ పథకాలను ఉపయోగించుకునే లేదా ఉపయోగించుకుంటారని భావించే విదేశీయులకు గ్రీన్‌కార్డును నిరాకరించే అధికారాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులకు కట్టబెడుతూ ట్రంప్ సర్కార్ కొత్త పాలసీ తీసుకొచ్చింది. గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల విషయంలో ఏ సంక్షేమ పథకాలను పరిగణనలోకి తీసుకుంటారనే విషయం కొత్త నిబంధనలో స్పష్టంగా చెప్పలేదని ఫిర్యాదులో రాష్ట్రాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ సహాయం కోరితే తమ ఇమ్మిగ్రేషన్‌పై ప్రభావం పడుతుందో లేదో తెలియని అనిశ్చితి పరిస్థితుల్లో ఆ కుటుంబాలను ఉంచారని చెప్పాయి. కొత్త నిబంధనను రద్దు చేయాలని ఆ రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు మన్‌హటన్ కోర్టును కోరాయి. కోర్టు వీరి దావాను పరిశీలించే అవకాశం ఉంది.