Share News

వెళ్లి మీరే చమురు తెచ్చుకోండి

ABN , Publish Date - Apr 01 , 2026 | 03:52 AM

ఇరాన్‌పై యుద్ధంలో పాల్గొనడానికి, హోర్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు రావాలన్న విజ్ఞప్తికి నిరాకరించిన నాటో, ఇతర యూ రప్‌ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి మండిపడ్డారు.

వెళ్లి మీరే చమురు తెచ్చుకోండి

  • కాస్త ధైర్యం తెచ్చుకుని వెళ్లి హోర్ముజ్‌ను స్వాధీనం చేసుకోండి

  • ఇకపై మీకోసం మీరు పోరాడాలి

  • అమెరికా ఎలాంటి సాయమూ చేయదు

  • యూకే సహా యూరప్‌ దేశాలపై డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపాటు

వాషింగ్టన్‌, మార్చి 31: ఇరాన్‌పై యుద్ధంలో పాల్గొనడానికి, హోర్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు రావాలన్న విజ్ఞప్తికి నిరాకరించిన నాటో, ఇతర యూ రప్‌ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి మండిపడ్డారు. కాస్త ధైర్యం తెచ్చుకుని వెళ్లి హోర్ముజ్‌ను తెరవాలని, చమురు తెచ్చుకోవాలని సూచించారు. ఈ మేరకు ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు. ‘‘ఇరాన్‌పై యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించిన, హోర్ముజ్‌ జలసంధి మూసివేత కారణంగా జెట్‌ ఇంధనం అందుకోలేని యూకే వంటి దేశాలకు రెండు సూచనలు. ఒకటి అమెరికా నుంచి చమురు కొనండి. మా వద్ద బోలెడంత చమురు ఉంది. రెండోది ఇప్పటికైనా కాస్త ధైర్యం తెచ్చుకుని వెళ్లి, హోర్ముజ్‌ జలసంధిని స్వాధీనం చేసుకోండి. మీరు ఇక మీదట మీకోసం మీరు పోరాటం నేర్చుకోవాలి. ఇక మీదట అమెరికా మీకు సహాయం చేయదు. నిజానికి ఇప్పుడు ఇరాన్‌ పూర్తిగా బలహీనపడింది. అసలైన పని పూర్తయింది. ఇప్పటికైనా వెళ్లి చమురు తెచ్చుకోండి’’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇక మిలిటరీ సరఫరాలతో ఇజ్రాయెల్‌కు వెళుతున్న అమెరికా సైనిక విమానాలను ఫ్రాన్స్‌ గగనతలం మీదుగా ప్ర యాణించేందుకు అనుమతివ్వలేదని మండిపడ్డారు. తమకు ఫ్రాన్స్‌ ఏమాత్రం సహకరించడం లేదని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటామని వ్యాఖ్యానించారు. కాగా, తాము ఇరాన్‌లో ఎక్కువ కాలం ఉండబోమని ట్రంప్‌ న్యూయార్క్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇరాన్‌ మిలిటరీ సామర్థ్యాలను దాదాపుగా నాశనం చేశామని, ఇంకా కొంత పని మిగిలి ఉంద న్నారు. ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ బఘర్‌ గలీబఫ్‌ సహా కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామని.. వారు అమెరికాతో కలిసి పనిచేస్తారా అన్నది తేలాల్సి ఉందని, దీనిపై ఒక వారంలో స్పష్టత వస్తుందని చెప్పారు. కాగా, ట్రంప్‌ చర్యల కారణంగానే హోర్ముజ్‌ నుంచి కొన్ని నౌకలైనా బయటికి వస్తున్నాయని.. ప్రపంచ దేశాలుకూడా ముందుకొచ్చి బాధ్య త తీసుకోవాలని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ షరతుల మేరకే ఘర్షణలకు ముగింపు ఉంటుందన్నారు. ఇరాన్‌కు వివేకముంటే ఒప్పందానికి రావాలని.. లేకుంటే తాము బాంబులతో చర్చలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్‌పై దాడుల విషయంలో సహకరించని నాటో దేశాల విషయంలో.. యుద్ధం తర్వాత ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించారు.

Updated Date - Apr 01 , 2026 | 03:52 AM