Share News

ఎగిరే వైట్‌హౌస్‌..

ABN , Publish Date - Jun 21 , 2026 | 05:39 AM

ఈ ఫొటోలోని విమానాన్ని చూశారు.. అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’ ఇది. ఇన్నాళ్లూ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ అనగానే తెలుపు, నీలం రంగులో ఉన్న భారీ విమానం గుర్తొచ్చేది.

ఎగిరే వైట్‌హౌస్‌..

  • ఖతార్‌ కానుకను ఎయిర్‌ఫోర్స్‌ వన్‌గా మార్చిన అమెరికా

ఈ ఫొటోలోని విమానాన్ని చూశారు.. అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’ ఇది. ఇన్నాళ్లూ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ అనగానే తెలుపు, నీలం రంగులో ఉన్న భారీ విమానం గుర్తొచ్చేది. అయితే, ఖతార్‌ పాలకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు గతేడాది ఓ బొయింగ్‌ 747 విమానాన్ని కానుకగా ఇచ్చిన సంగతి గుర్తుందా ..! ఆ విమానమే ఇది. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌గా వినియోగించేందుకు వీలుగా ఆ విమానానికి అవసరమైన మార్పులు చేర్పులు చేసిన అమెరికా వాయుసేన.. తమ జాతీయ పతాకంలోని ముదురు నీలం, ఎరుపు, తెలుపు రంగులతో అధ్యక్షుడి విమానానికి కొత్త లుక్‌ ఇచ్చింది. ఈ రంగులను అధ్యక్షుడు ట్రంప్‌ ఎంపిక చేశారట..! ఈ కొత్త ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ను జాయింట్‌ బేస్‌ ఆండ్రూ్‌సలో అధ్యక్షుడు ట్రంప్‌ శుక్రవారం ఆవిష్కరించారు. బోయింగ్‌కు ఇప్పటికే ఆర్డర్‌ ఇచ్చిన కొత్త విమానాలు వచ్చే వరకు.. అమెరికా అధ్యక్షుడి ప్రయాణాలకు ఇప్పటికే ఉన్న ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానాలతోపాటు ఈ కొత్త విమానాన్ని కూడా వినియోగించనున్నారు. అధ్యక్షుడు ఏ విమానంలో ప్రయాణించాలనేది భద్రతా విభాగం నిర్ణయిస్తుంది. కాగా, ఈ విమానాన్ని ఎగిరే వైట్‌ హౌస్‌ అని అభివర్ణించిన అధ్యక్షుడు ట్రంప్‌.. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన విమానం ఇదేనని పేర్కొన్నారు. జూలై 4న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఈ విమానాన్ని ప్రదర్శించే అవకాశముంది. ఇక, టర్కీ వేదికగా వచ్చే నెలలో జరగనున్న నాటో సదస్సుకు తాను ఈ కొత్త విమానంలోనే వెళ్లి వస్తానని ట్రంప్‌ కూడా ప్రకటించారు

- వాషింగ్టన్‌

Updated Date - Jun 21 , 2026 | 05:39 AM