గ్రహాంతరవాసుల సమాచారం బహిర్గతం చేస్తాం: ట్రంప్
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:22 AM
గ్రహాంతరవాసుల(ఏలియన్స్) ఉనికిపై త్వరలో తాజా సమాచారం అందుబాటులోకి రానుంది. గ్రహాంతర జీవులు, అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: గ్రహాంతరవాసుల(ఏలియన్స్) ఉనికిపై త్వరలో తాజా సమాచారం అందుబాటులోకి రానుంది. గ్రహాంతర జీవులు, అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్(యూఎ్‌ఫవో)లకు సంబంధించి అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్న ఫైళ్లను విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. గ్రహాంతరవాసుల ఉనికిపై గతవారం ఒక పాడ్‌కా్‌స్టలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యలు చేయడాన్ని గురువారం ట్రంప్ విమర్శించారు. ఒక రహస్య సమాచారాన్ని వెల్లడించి ఒబామా పెద్ద తప్పు చేశారని, ఆయన అలా చేసి ఉండకూడదన్నారు. గ్రహాంతరవాసుల ఉనికిపై తనకు ఎలాంటి అభిప్రాయం లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఫైళ్ల విడుదలపై ట్రంప్ ప్రకటన చేశారు. పాడ్‌కా్‌స్టలో ఒబామా మాట్లాడుతూ, ‘‘గ్రహాంతరవాసులు ఉన్నమాట నిజమే. అయితే వారిని నేను చూడలేదు. ఏరియా 51లో వారిని ప్రభుత్వం నిర్బంధించిందనడంలో నిజం లేదు. అక్కడ ఎలాంటి భూగర్భ కేంద్రాలు లేవు’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలను ఆయన సోషల్ మీడియాలో సమర్థించుకున్నారు. ‘‘ఈ విశ్వం చాలా విశాలమైనది. ఇతర గ్రహాల్లో జీవం ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ సౌర వ్యవస్థల మధ్య దూరాలు బాగా ఎక్కువ కావడంతో ఏలియన్లు మనల్ని సందర్శించే అవకాశాలు తక్కువ. గ్రహాంతరవాసులు మాతో సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పడానికి నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు’’ అని ఒబామా వివరించారు.