ట్రంప్ జల‘సంధి ప్రేలాపన’
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:52 AM
ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధికి ఏకంగా తన పేరును పెట్టుకున్నారు.
హోర్ముజ్ జలసంధికి తన పేరు పెట్టుకున్న అధ్యక్షుడు
ఇక నుంచి ‘ట్రంప్ జలసంధి’గా వ్యవహరిస్తామని ప్రకటన
న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధికి ఏకంగా తన పేరును పెట్టుకున్నారు. హోర్ముజ్‌ను అమెరికా ఇక నుంచి ‘ట్రంప్ జలసంధి’గా వ్యవహరిస్తుందని ప్రకటించుకున్నారు. పైగా దీన్ని ఇరాన్ నాయకత్వం స్వాగతిస్తుందని తాను నమ్ముతున్నానని చెప్పారు. విస్తృత శాంతి ఒప్పందానికి తొలి అడుగుగా హోర్ముజ్‌ను తెరిచేందుకు అమెరికా-ఇరాన్ మధ్య జూన్‌లో ఒప్పందం జరిగినప్పటికీ ఆ జలసంధి విషయంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. డల్లా్‌సలో ఓ ఎన్నికల సదస్సులో ట్రంప్ ప్రసంగిస్తూ.. ‘‘ఇరాన్ పతనమవుతోంది. ఆ దేశంతో జరుగుతున్న యుద్ధంలో మనం గెలవనున్నాం. ఆ వెంటనే చమురు ధరలు తగ్గుతాయి’’ అని అమెరికా ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హోర్ముజ్ ప్రస్తుతం అమెరికా నియంత్రణలోనే ఉందని.. ఆ గుర్తింపు తనకు దక్కాలని, అందుకే, దాన్ని ఇక నుంచి ‘ట్రంప్ జలసంధి’ అని పిలవాలని పిలుపునిచ్చారు. పికాక్స్ పర్వత శ్రేణుల్లో ఇరాన్ కార్యకలాపాలపై తమకు సమాచారం ఉందని, ఆ ప్రాంతాన్ని అమెరికా లక్ష్యం చేసుకోవొచ్చునని హెచ్చరించారు. ఈ సమయంలో ఇరాన్ ఎలాంటి కుయుక్తులకు పాల్పడినా తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తప్ప అమెరికా ఎదుట మరో మార్గం లేదని ఆయన అన్నారు.