ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:13 AM
ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందమూ ఉండబోదని, వాళ్లు బేషరతుగా లొంగిపోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇరాన్‌ను పాలించేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన....
ఆ దేశంతో ఏ ఒప్పందం ఉండదు: ట్రంప్
వాషింగ్టన్, మార్చి 6: ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందమూ ఉండబోదని, వాళ్లు బేషరతుగా లొంగిపోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇరాన్‌ను పాలించేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన, గొప్ప నేతలను ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. అమెరికా, మిత్రదేశాలు కలిసి ఇరాన్‌ను గొప్పగా పునరుద్ధరించేందుకు అవిశ్రాంతంగా చర్యలు చేపడతాయని పేర్కొన్నారు. ఆర్థికంగా ఇంతకుముందటి కంటే గొప్పగా, బలంగా తీర్చిదిద్దుతామని.. ఇరాన్‌కు గొప్ప భవిష్యత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. కాగా, ఇరాన్ బలగాలు ఆయుధాలను వదిలేయాలని, లేదంటే చావు తప్పదని అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ హెచ్చరించారు. ఐఆర్‌జీసీ, సైనికులు, పోలీసులు సహా ఇరాన్ భద్రతా బలగాల సిబ్బంది అంతా ఆయుధాలను వీడి, చరిత్రలో మంచివైపు నిలవాలని పిలుపునిచ్చారు. ఇరాన్ మిలిటరీ భారీగా నష్టపోయిందని.. నౌకాదళం, గగనతల రక్షణ, క్షిపణి ప్రయోగ వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని తెలిపారు.
ధరలు పెరగనీ.. యుద్ధమే ముఖ్యం
యుద్ధం కారణంగా అమెరికాలో పెట్రోల్ ధరలు పెరగడం తననేమీ ఆందోళనకు గురిచేయడం లేదని ట్రంప్ రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘‘నాకు యుద్ధమే ముఖ్యం. చమురు ధరలైనా, మరొకటైనా దాని తర్వాతే. ప్రస్తుత పెరుగుదల స్వల్పమే. యుద్ధం ముగిస్తే చమురు ధరలు వాటంతట అవే తగ్గుతాయి’’ అని పేర్కొన్నారు. కాగా, పశ్చిమాసియా నుంచి వేలాది మంది అమెరికన్లను తరలించేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టామని తెలిపారు.