బర్గమ్ భార్య అందంగా ఉందనే.. ఆయనకు మంత్రి పదవిచ్చా!
ABN , Publish Date - Jan 31 , 2026 | 03:43 AM
ఎవరైనా ప్రతిభను చూసి పదవి ఇస్తారు! మన కులం వాడనో.. మన మతం వాడనే అభిమానంతోనో పదవి ఇచ్చేవారూ ఉంటారు! కానీ...
వాషింగ్టన్, జనవరి 30: ఎవరైనా ప్రతిభను చూసి పదవి ఇస్తారు! మన కులం వాడనో.. మన మతం వాడనే అభిమానంతోనో పదవి ఇచ్చేవారూ ఉంటారు! కానీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలాంటివారందరికీ భిన్నం! అమెరికన్ వ్యాపారి, రాజకీయ నాయకుడు అయిన డగ్ బర్గమ్ భార్య అందంగా ఉంది కాబట్టే ఆయనకు తన క్యాబినెట్‌లో మంత్రి పదవి ఇచ్చానని చెప్పారు! అంత అందమైన భార్యను కలిగున్న ఎవరైనా విజేతలేనని.. అందుకే తాను బర్గమ్‌తో కలిసి పని చేయాలనుకున్నానని వివరించారు. తన ఆఫీసులో ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో డగ్ బర్గమ్, ఆయన భార్య సైతం అక్కడే ఉండడం.. వారి ముందే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. డగ్ బర్గమ్‌ను, ఆయన భార్య కాథ్రిన్‌ను తాను ఒక గుర్రపుస్వారీ వీడియోలో మొదటిసారి చూశానని.. అ ప్పుడు క్యాథ్రిన్ తన దృష్టిని ఆకర్షించారని చెప్పారు. ‘‘వారిద్దరి వీడియోను చూసినప్పుడు.. ‘ఆమె ఎవరు?’ అని ప్రశ్నించాను. అప్పుడే ఆమె గురించి తెలిసింది. అప్పుడు.. ‘అయితే నేను ఇతణ్ని(బర్గమ్‌ను) పనిలోకి తీసుకుంటాను’ అన్నాను’’ అని ట్రంప్ చెప్పారు.