జెలెన్‌స్కీకి రష్యాతో యుద్ధం ముగించాలని లేదు: ట్రంప్
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:13 AM
రష్యాతో నాలుగున్నరేళ్లకు పైగా సాగుతున్న యుద్ధం ముగించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.
వాషింగ్టన్, అక్టోబరు 19: రష్యాతో నాలుగున్నరేళ్లకు పైగా సాగుతున్న యుద్ధం ముగించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. వచ్చే నెల జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తమ రిపబ్లికన్ పార్టీ దెబ్బతినేలా ఉక్రెయిన్ ఉద్దేశపూర్వకంగానే రష్యా చమురు రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. మొన్ననే చమురు విషయంలో రష్యాపై ఆంక్షలను తాత్కాలికంగా సడలించిన ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆంక్షల సడలింపు నిర్ణయాన్ని సమర్థించుకున్న ట్రంప్.. రష్యాను చర్చల నుంచి దూరం చేసే ఎలాంటి అవివేక పనులు చేయదలుచుకోలేదని ‘ట్రూత్ సోషల్’ పోస్ట్‌లో రాశారు. ఇరాన్‌కు సహాయం చేయడానికి రష్యా పెద్దగా ప్రయత్నించడం లేదని, ఇదిలాగే కొనసాగాలని కోరకుంటున్నానని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరుపుతున్నానని, గొప్ప పురోగతి సాధిస్తున్నానని కూడా ట్రంప్ చెప్పుకున్నారు. కానీ జెలెన్‌స్కీకి ఏమాత్రం పట్టడం లేదని, పైగా భారీ మొత్తంలో ఐరోపా ఇస్తున్న నిధుల వల్ల ఆయన ఈ యుద్ధాన్ని ముగించాలనుకోవడం లేదని విమర్శించారు.