ఈ జడ్జీలు.. దేశాన్ని దెబ్బతీస్తున్నారు
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:13 AM
హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడం చట్టవిరుద్ధమంటూ, ఆ నిర్ణయాన్ని కొట్టేస్తూ యూఎస్ ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా విమర్శించారు.
హెచ్-1బీ వీసా ఫీజు పెంపును కొట్టివేయడంపై ట్రంప్
వాషింగ్టన్, జూన్ 9: హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడం చట్టవిరుద్ధమంటూ, ఆ నిర్ణయాన్ని కొట్టేస్తూ యూఎస్ ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి చర్యలు దేశాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ‘‘ఈ న్యాయమూర్తులు నిజంగా మాకు చాలా కష్టాలు తెచ్చిపెడుతున్నారు. దేశాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. ఇది నిజంగా పిచ్చితనం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. కోర్టు తీర్పుతో తాము తగ్గేది లేదని వైట్‌హౌస్ యంత్రాంగం స్పష్టం చేస్తోంది. హెచ్1బీ వీసా ఫీజు పెంపును కొట్టేస్తూ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును అప్పిలేట్ కోర్టులో సవాల్ చేస్తామని అమెరికా అధ్యక్ష భవన అధికార ప్రతినిధి టేలర్ రోగర్స్ తెలిపారు. హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమంటూ కోర్టు కొట్టేయడంపై అమెరికా చట్టసభల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. వారిలో కొందరు రిపబ్లికన్ సభ్యులు కూడా ఉండడం గమనార్హం. అయితే, వారి ఆందోళన హెచ్1బీ వీసాలను ఎక్కువగా పొందే ఐటీ రంగం గురించి కాదు. వీసా ఫీజు పెంపు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతుందని వారు పేర్కొంటున్నారు. కోర్టు తీర్పును పలు ప్రవాస భారతీయ సంఘాలు, సంస్థలు కూడా స్వాగతించాయి.
750 డాలర్లు చెల్లిస్తే 10రోజుల్లోనే వీసా ఇంటర్వ్యూ
వీసా ఇంటర్వ్యూల కోసం చెల్లించే 185 డాలర్లకు అదనంగా 750 డాలర్లు చెల్లించిన వారికి.. వీసా ఇంటర్వూలను పదిరోజుల్లోనే నిర్వహించేందుకు ట్రంప్ సర్కారు సిద్ధమైంది. జూలై 1 నుంచి డిసెంబరు 31 నడుమ దీన్ని పైలట్ ప్రోగ్రామ్ కింద ఎంపిక చేసిన ఎంబసీలు, కాన్సులేట్లలో నిర్వహించనున్నారు. ఏయే ఎంబసీల్లో ఈ ప్రీమియం సేవ అందుబాటులోకి వచ్చేదీ జూలై 1కి ముందు వెల్లడిస్తారు. ఇదిలా ఉండగా, అమెరికాలో ఉంటూ బ్యాంక్ ఫ్రాడ్, ఇమ్మిగ్రేషన్ ఫ్రాడ్, మైనర్లపై లైంగిక దాడి వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన 17 మంది విదేశీ మూలాలున్న వ్యక్తుల పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా న్యాయశాఖ నడుం బిగించింది.. ఆ పదిహేడు మందిలో.. భారత సంతతికి చెందిన నీరజ్‌శర్మ(50) అనే వ్యక్తి కూడా ఉన్నారు. రెండేళ్ల కాలవ్యవధిలో 11 నకిలీ హెచ్-1బీ వీసా దరఖాస్తులను సమర్పించడమే ఆయన చేసిన నేరం.